danger2050 | పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రపంచానికి పెద్ద ముప్పు!

danger2050 | పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రపంచానికి పెద్ద ముప్పు!
danger2050 | భూతాపం పెరుగుదల.. పెరుగుతున్న ప్రమాదం
ఉష్ణోగ్రతల వల్ల పెరుగుతున్న మరణాలు
పేద దేశాల్లో అధిక ప్రభావం
భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక
danger2050 భూమండలంపై వాతావరణ మార్పుల కారణంగా ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. అకాలవర్షాలు, వరదలు, భూకంపాలు ఇలా ఏదో ఒక రూపంలో ప్రపంచంలో ఏదో ఒక చోట ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, అత్యధిక సంఖ్యలో సంభవిస్తున్న మరణాలకు వరదలో, ప్రకృతి విపత్తులో పెద్ద ముప్పు కాదు. నిజానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలే అసలైన హంతకులు. తాజా అధ్యయనం ఇదే విషయాన్ని చెబుతోంది. ఈ భూమండలంపై చల్లని ప్రాంతాల్లో మరణాలు తక్కువగాను, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో అత్యధికంగాను ఉన్నాయి. ఇది ఓ ప్రమాద సూచిక. భూతాపం తగ్గడానికి ఇప్పటినుంచి చర్యలు తీసుకోకపోతే ఉష్ణోగ్రతలే ప్రజల ప్రాణాలు తీస్తాయని హెచ్చరించింది.

క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ మోర్టాలిటీ నివేదికలో విస్తుగొలిపే అంశాలు వెల్లడయ్యాయి. స్కాండినేవియా వంటి శీతల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల జరిగే మరణాల సంఖ్య తక్కువగా ఉంది. చల్లని వాతావరణం ప్రాణాలను హరించదు. కానీ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరణాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియాలలో ఉష్ణోగ్రతల వల్ల సంభవించే మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది.
ఉదాహరణకు సాహెల్ ప్రాంతంలోని నైజర్, బుర్కినా ఫాసో దేశాల్లో ప్రతి లక్ష మందిలో 60 మంది ఉష్ణతాపంవల్లే మరణిస్తున్నారు. ఆఫ్రికాలో మలేరియా వల్ల సంభవిస్తున్న మరణాలకంటే ఇది ఎక్కువ. ఇక పాకిస్తాన్‌లో 2050 నాటికి ప్రతి లక్షమందిలో 51మంది కేవలం ఉష్ణతాపం వల్ల మరణిస్తారని హెచ్చరిస్తోంది ఈ నివేదిక.
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న పేద దేశాల్లో ఈ మరణాల సంఖ్య మరీ అత్యధికంగా ఉంటోంది. ఎందుకంటే వేడిని తట్టుకునే, నివారించే సౌకర్యాలు, సౌలభ్యాలు, ఆర్థిక స్థితి వారికి లేదు. తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ఏటా పదిరెట్లు ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతల పెరుగుదలవల్ల మరణిస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది.
తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి, మధ్యప్రాచ్యంలోని కువైట్‌లలో ఈ తరహా మరణాల సంఖ్య బాగా పెరిగినట్లు తేలింది. జిబౌటీలో ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల కలిగే మరణాల్లో ప్రతీ లక్షమందికి 55 చొప్పున పెరిగాయని, (అక్కడ హెచ్‌ఐవీ వల్ల కలిగే మరణాలతో సమానంగా) అలాగే, కువైట్‌లో ప్రతి లక్షమందిలో 25 మంది అదనంగా మరణిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. కువైట్‌లో గుండె వ్యాధుల వల్ల మరణిస్తున్నవారి సంఖ్యలో సగం ఇది.
ఇక ఫోనిక్స్ అండ్ మాడ్రిడ్‌లలో ఇలాంటి మరణాల సంఖ్య వరుసగా 600, 525 చొప్పున ఉండొచ్చని అంచనా వేసింది. అయితే, పేద దేశాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల కలిగే మరణాల సంఖ్య వేలల్లో ఉండనుంది. ఒక అంచనా ప్రకారం, పాకిస్తాన్‌లోని పైసలాబాద్‌లో 9400 అదనపు మరణాలు సంభవించనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల పట్టణ జనాభాలో కనీసం లక్షమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మరణాల్లో ప్రతీ మూడింటిలో ఒకటి పాకిస్తాన్‌లోనే సంభవిస్తాయని పేర్కొంది. అందువల్ల భూతాపాన్ని తగ్గించడానికి, ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడటానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి కార్యాచరణ చేపట్టకపోతే మరణమృదంగం తప్పదు.
