AP | మూడు దూడలు బలి

AP | మూడు దూడలు బలి
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలకు కారణమైంది. పశువులపై దాడి చేయడంతో గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం కొత్తవీధి సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం పశువుల మందపై దాడి చేసిన పులి మూడు గేదె దూడలను చంపింది. దీంతో పశువుల కాపరులు, స్థానికులు అడవిలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు.
ఈ ఘటనతో సమీప గిరిజన గ్రామాల్లో భయాందోళనల వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన దూడలను పరీక్షించి అవి పులి దాడిలోనే చనిపోయినట్లు నిర్ధారించారు.
పులి సంచారం నేపథ్యంలో కొత్తవీధి సమీపంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, ముసినిమిల్లి గ్రామ ప్రజలకు అధికారులు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. రాత్రి వేళల్లో బయటకు రావద్దని, పశువుల వద్ద జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పులి కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
