fruits| వేసవిలో ఇవే తినండి..

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఎండలకు దాహం అధికంగా వేస్తుంది. దీంతో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కానీ అవి ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి సమయంలో తక్షణ శక్తినిచ్చే పానీయాలను కానీ, పండ్లను స్వీకరిస్తే మంచిది. శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచడానికి నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, మామిడి, ఖర్బూజ, నిమ్మ, బొప్పాయి, ద్రాక్ష, నేరేడు, మరియు పైనాపిల్ వంటి పండ్లు తినడం చాలా మంచిది. ఇవి శరీరంలో డీహైడ్రేషన్ తగ్గించి, శక్తిని అందిస్తాయి.

- పుచ్చకాయ : వేసవి వేడిని తట్టుకోవాలంటే పుచ్చకాయ తినడం అత్యుత్తమమైన మార్గం. 90% పైగా నీటిని కలిగి ఉండి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. శరీరాన్ని తేమతో నింపి వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో విటమిన్ సి, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
- మామిడిపండ్లు : మామిడి పండు రుచిగా ఉంటుంది.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండి, తక్షణ శక్తిని ఇస్తాయి. మామిడిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. మామిడి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. శరీరానికి తగిన శక్తిని అందించడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది.
- కర్బూజ : తర్బూజా పండ్లలో చలువ చేసే గుణం, విటమిన్ C, A పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో ఎంతో సహాయపడతాయి. ఈ పండులో పొటాషియం, విటమిన్ సి, నీరు అధికంగా ఉంటాయి. శరీరంలో నీటి స్థాయిలను సమతుల్యం చేస్తాయి.
- బొప్పాయి : ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫోలేట్ అధికంగా ఉంటాయి. వేసవిలో తరచుగా ఎదురయ్యే జీర్ణ సమస్యలను తగ్గించడానికి బొప్పాయి ఎంతో ఉపయోగకరం. ఇందులోని నేచురల్ ఎంజైమ్‌లు, ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా పనిచేస్తాయి.
- పైనాపిల్ : పైనాపిల్ సన్‌బర్న్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. పుల్లటి రుచితో మిమ్మల్ని ఆకర్షించడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో తరచుగా వచ్చే శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో కూడా పైనాపిల్ ఉపయోగపడుతుంది.
- లిచీ ఫ్రూట్ : వేసవిలో వచ్చే పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి. ఇది చాలా రుచికరమైన జ్యుసి ఫ్రూట్. ఇందులో నీరు పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ సి, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు లిచీలో లభిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఈ పండు.
- నిమ్మజాతి పండ్లు : విటమిన్ C అధికంగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- నేరేడు : ఇనుము మరియు విటమిన్ సీ,ఏ కలిగి ఉండి, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. నేరేడు పండ్లను “బ్లాక్బెర్రీస్” అనికూడా అంటారు. ఇవి తినడం వల్ల చాలాప్రయోజనాలు ఉన్నాయి. వేసవి కాలంలోనే లభించే పండు ఇది. రుచితో పాటు అనేక ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. విటమిన్ సి ,ఐరన్ ఉంటాయి. ఇది శరీరంలోని రక్తహీనతను నిర్మూలించడంలో సహాయపడుతుంది.
- ద్రాక్ష : ద్రాక్ష చాలా రుచికరమైన పండు. వేసవిలో దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇవి మార్కెట్లో అనేక రంగుల్లో లభిస్తున్నాయి. ఈ పండు అరుగుదల శక్తిని పెంపొందిస్తుంది.
- స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటి బెర్రీలు శరీరంలో వ్యర్థాలను బయటకు పంపించడంలో సహాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.
- కొబ్బరి నీళ్లు : కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది సహజ ఎలక్ట్రోలైట్‌గా పని చేసి శరీరాన్ని తేమతో నింపుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.
- మజ్జిగ : మజ్జిగ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా వేడి వల్ల వచ్చే నీరసం, అలసట వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
