వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ..

వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ..
ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు..
కలెక్టరేట్ లో 9154970454తో కంట్రోల్ రూం..
ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
పటమట, ఆంధ్రప్రభ : జిల్లాలో వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని.. ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ తెలిపారు. శనివారం జేసీ ఇలక్కియ అధికారులతో కలిసి విజయవాడ ఆటోనగర్‌లోని మాధవ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని, హెచ్‌పీ గ్యాస్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ సరఫరా ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అవసరం మేరకు ఉన్నాయని, సరఫరా వ్యవస్థను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. వినియోగదారులు గ్యాస్ కొరతపై ఎలాంటి అపోహలకు లోనుకావద్దని, సాధారణ విధంగానే గ్యాస్ సరఫరా కొనసాగుతోందని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు కూడా వినియోగదారులకు నిర్దేశ సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తినట్లయితే లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఇందుకోసం 9154970454 ఫోన్ నంబర్‌తో కంట్రోల్ రూం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. జిల్లాలో గ్యాస్ సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు ఆయిల్ కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజలు అనవసరంగా గ్యాస్ నిల్వ చేసుకోవడం లేదా అపోహలను నమ్మడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశముందని, అందువల్ల అలాంటి చర్యలకు పాల్పడకూడదని జేసీ ఇలక్కియ విజ్ఞప్తి చేశారు. జేసీ వెంట డీఎస్వో పి.వాణి, ఏఎస్వో వి.శ్రీనివాస్, విజయవాడ తూర్పు తహసీల్దార్ ఆర్.రోహిణిదేవి తదితరులు ఉన్నారు.
