వాట్సాప్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు…

వాట్సాప్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు…
గుంటూరు జీజీహెచ్‌లో కొత్త విధానం..
గుంటూరు, ఆంధ్రప్రభ : ప్రజలకు వైద్య సేవలను మరింత సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ఆధారిత సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం, తాజాగా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి సేవలను కూడా ఇందులో చేర్చింది.
ఈ నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో వైద్య సేవలకు ముందస్తు నమోదు చేసుకునే సౌకర్యాన్ని వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ యశస్వి రమణ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం అందించిన ప్రత్యేక వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా మొబైల్ నంబర్ నమోదు చేసి, ఆధార్ కార్డు వివరాలతో లాగిన్ అయ్యే విధానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ విధానంలో నమోదు చేసుకున్న తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సుమారు 36 రకాల వైద్య సేవలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. జనరల్ మెడిసిన్ నుంచి వివిధ సూపర్ స్పెషాలిటీ విభాగాల వరకు అవసరమైన వైద్య సేవను ముందుగానే ఎంచుకుని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చన్నారు.
ఈ ప్రక్రియ బుక్ మై షోలో సినిమా టికెట్ బుక్ చేసే విధానానికి సమానంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వాట్సాప్‌లో నమోదు పూర్తి చేసిన తర్వాత రోగికి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అందుతుంది. ఆ నంబర్‌తో ఆసుపత్రికి వచ్చిన రోగికి వెంటనే ఓపీ స్లిప్ జారీ చేసి సంబంధిత వైద్యుడి వద్దకు పంపేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఇలా ముందస్తు నమోదు చేయడం ద్వారా ఆసుపత్రిలో క్యూలలో నిలబడే సమయం తగ్గి, రోగులు త్వరగా వైద్యులను కలిసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు ఇతరులకు అవగాహన కల్పించాలని డాక్టర్ రమణ సూచించారు. ప్రజల సహకారంతో ఈ విధానం విజయవంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని వైద్య సేవలను కూడా ఈ వాట్సాప్ వేదిక ద్వారా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
