Train |కదిలే రైలు నుంచి పడి బాలికకు ప్రమాదం…

Train | కదిలే రైలు నుంచి పడి బాలికకు ప్రమాదం…
ఒంగోలు సమీపంలో అర్ధరాత్రి ఘటన
అప్రమత్తంగా స్పందించిన రైల్వే సిబ్బంది
సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత
స్వల్ప గాయాలతో తప్పిన ప్రాణాపాయం
Train | విజయవాడ, ఆంధ్రప్రభ : ఒంగోలు సమీపంలో పరుగు తీస్తున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయిన చిన్నారిని రైల్వే సిబ్బంది, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సంయుక్తంగా అప్రమత్తంగా స్పందించి సురక్షితంగా కాపాడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాలిక స్వల్ప గాయాలతో బయటపడింది. ఫిబ్రవరి 25 రాత్రి 11:53 గంటలకు ధర్మవరం–నరసాపురం ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మేనేజర్ సమాచారం మేరకు, సూరారెడ్డిపాలెం ఒంగోలు మధ్యలో, ఒంగోలు స్టేషన్‌కు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో సుమారు 9 సంవత్సరాల బాలిక పరుగు తీస్తున్న రైలు నుంచి పడిపోయింది.
రాత్రి 12:03 గంటలకు రైలు ఒంగోలు చేరుకోగానే బాలిక తల్లిదండ్రులు దిగిపడి వెంటనే రైల్వే అధికారులకు, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్టేషన్ అధికారులు వెంటనే అప్రమత్తమై, వెంటనే వెనుక నుంచి వస్తున్న తిరుపతి–కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ సిబ్బందికి సమాచారం చేరవేశారు.

తదనంతరం లోకో పైలట్ బాలికను గుర్తించి ఒంగోలు సమీపంలోని ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నల్ వద్ద రైలును ఆపాడు. ముందుభాగంలోని జనరల్ కోచ్‌లో ఉన్న ప్రయాణికులు బాలికను సురక్షితంగా ఎత్తుకొని కాపాడారు. ఇదే సమయంలో ట్రాక్‌లపై గాలింపు చర్యలు చేపట్టిన ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Train | స్టేషన్ మాస్టర్ సమక్షంలో
బాలికను అనంతరం స్టేషన్ మాస్టర్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. ఎడమ చేయి, కాళ్లకు స్వల్ప గాయాలు కావడంతో సమీప ఆసుపత్రిలో తక్షణమే ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనలో రైల్వే సిబ్బంది చాకచక్యంగా స్పందించి బాలిక ప్రాణాలను రక్షించడం పట్ల కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స అనంతరం కుటుంబం విజయవాడ వైపు చెన్నై–శాలిమార్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రయాణం చేసారు. ఈ సంఘటన రైల్వే సిబ్బంది అప్రమత్తత, సమన్వయం, వేగవంతమైన చర్యలకు నిదర్శనంగా నిలిచింది.
