Festival-2026 | విదేశాల నుంచి లక్షలాది భ‌క్తులు…

Festival-2026 | విదేశాల నుంచి లక్షలాది భ‌క్తులు…

మార్చి 6 నుంచి 8వ తేదీ వ‌ర‌కు ప్ర‌త్యేక ఆధ్యాత్మిక మ‌హోత్సవం..
12 ఏళ్ల‌కోసారి జరిగే కుంభాభిషేకం నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ట ఏర్పాట్లు..
ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా సౌక‌ర్యాలు..
విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

Festival-2026 | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామి వార్ల దేవ‌స్థానంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వ‌ర‌కు శాస్త్రోక్తంగా, అత్యంత వైభ‌వంగా కుంభాభిషేక హోత్స‌వం జ‌ర‌గ‌నుంద‌ని.. ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం 12 ఏళ్ల‌కోసారి ఆల‌యంలోని దైవిక‌శ‌క్తి పున‌రుద్ధ‌ర‌ణ‌కు కుంభాభిషేకం మ‌హోత్స‌వాన్ని నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని, ఇందుకు ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు.

కుంభాభిషేక మ‌హోత్స‌వం-2026 నిర్వ‌హ‌ణ‌పై ఎంపీ కేశినేని శివ‌నాథ్‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు, ఆల‌య ధర్మకర్తల మండలి ఛైర్మ‌న్ బొర్రా రాధాకృష్ణ‌, ఆల‌య ఈవో వీకే శీనా నాయ‌క్ త‌దిత‌రుల‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ శివ‌నాథ్ మాట్లాడుతూ కంచి కామ‌కోటి పీఠాధిప‌తులు శంక‌ర విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి వారి చేతుల‌మీదుగా క‌న‌క‌దుర్గ‌మ్మ ప్ర‌ధాన ఆల‌య శిఖ‌ర విమాన‌గోపురానికి అభిమంత్రించిన అనేక పుష్క‌ర మ‌హా జీవ‌న‌దులు, స‌ముద్రోద‌క‌ముల‌తో కుంభాభిషేకం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.

మ‌హోత్స‌వానికి ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి హాజ‌ర‌వుతార‌న్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో వైదిక క్రతువులు జ‌రుగుతాయ‌ని.. దేశ విదేశాల నుంచి ల‌క్ష‌లాది భ‌క్తులు వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నామ‌ని, భ‌క్తుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందుకు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. ద‌స‌రా ఉత్స‌వాలతో పాటు అనేక కార్య‌క్ర‌మాల‌ను చిన్న ఇబ్బంది కూడా లేకుండా విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో జిల్లా అధికారులు, ఆల‌య అధికారులు కృషిచేశార‌ని.. ఇదేవిధంగా మున్ముందు కూడా కృషిచేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

Festival-2026 |

Festival-2026 | సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట‌..

కుంభాభిషేకం హోత్స‌వాల స‌మ‌యంలో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేయ‌నున్నామ‌ని.. మ‌హోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. టీమ్ ఎన్‌టీఆర్ ఆధ్వ‌ర్యంలో ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, గౌర‌వ ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల స‌మష్టి కృషితో ఆధ్యాత్మిక మ‌హా కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేస్తామ‌ని పేర్కొన్నారు.

Festival-2026 |

అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌తో ఏర్పాట్లు చేస్తున్నామ‌ని.. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నామ‌న్నారు. దసరా సమయంలో రోజుకి రెండు లక్షల మంది భ‌క్తులు వ‌చ్చినా ఇబ్బంది లేకుండా చూశామ‌ని.. ఇప్పుడు రోజుకు మూడు ల‌క్ష‌ల మంది వ‌చ్చినా ఇబ్బంది లేకుండా పూర్తి స‌న్న‌ద్ధ‌త‌తో రాజీలేకుండా ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు.

Festival-2026 |

Festival-2026 | భ‌క్తుల భ‌ద్ర‌త‌కు భ‌రోసా..

భ‌క్తుల భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పిస్తూ ప‌టిష్ట బందోబ‌స్తుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు తెలిపారు. ఏటా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంద‌ని.. కుంభాభిషేక మ‌హోత్స‌వానికి కూడా లక్షలాదిమంది భక్తుల హాజరవుతారని అంచ‌నా వేస్తున్నామ‌ని.. ఇందుకు త‌గ్గ‌ట్లు ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో పోలీసు శాఖ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

Festival-2026 |

ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు లింగంభొట్ల దుర్గాప్ర‌సాద్, వైదిక క‌మిటీ స‌భ్యులు ష‌ణ్ముకశాస్త్రి కుంభాభిషేక మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మాల గురించి వివ‌రించారు. భార‌త‌దేశంలోని పుణ్య న‌దులు, తీర్థాలు, స‌ప్త స‌ముద్రాల జ‌లాల‌ను క‌ల‌శాల‌లో ఉంచి, యాగ‌శాల‌లో మంత్ర‌యుక్తంగా పూజించిన త‌ర్వాత వైదికంగా చేసే అభిషేక‌మే కుంభాభిషేక‌మ‌ని వివ‌రించారు. మార్చి 6న యాగశాలలో ఉదయం 8 గంటల నుండి యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహ వాచనం, దీక్షాధారణ, పంచగవ్య ప్రాశనం, అఖండ దీపారాధన, మధ్యాహ్నం 12 గంటలకు అంకురార్పణ. సాయంత్రం 4 గంటల నుండి అగ్నిప్రతిష్టాపన, మూలమంత్ర హవనములు, హారతి, రాత్రి 7 గంటలకు మంత్రపుష్పము ఉంటుంద‌న్నారు.

Festival-2026 |

అదేవిధంగా ఏడో తేదీన యాగశాలలో ఉదయం 8 గంటల నుండి వివిధ పవిత్ర నదీ, సముద్ర జలాల‌తో అష్టోత్తర కలశస్థాపన, పూజ, పీఠ పూజలు, మధ్యాహ్నం 12 గంటలకు మూలమంత్ర హవనములు. సాయంత్రం 4 గంటల నుండి మూలమంత్రహవనములు, ప్రదోషకాల పీఠపూజలు, హారతి, రాత్రి 7 గంటలకు మంత్రపుష్పము ఉంటుంద‌ని వివ‌రించారు.

8వ తేదీన యాగశాలలో ఉదయం 7 గంటల నుండి మంటప పూజలు, మూలమంత్ర హవనములు, ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి. ఉదయం 9:34 నిమిషములకు మేషలగ్నంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కుంభాభిషేకం జ‌రుగుతుంద‌ని తెలిపారు. కుంభాభిషేకం అనంతరం రాజగోపురం ప్రాంగణంలో కళావేదికపై శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి అనుగ్రహ భాష‌ణం ఉంటుంద‌ని తెలిపారు.

Leave a Reply