Congress | బీజేపీకి మద్దతు ఇచ్చి.. ఇప్పుడు నిధుల కోసం ప్రదక్షణలు

Congress | బీజేపీకి మద్దతు ఇచ్చి.. ఇప్పుడు నిధుల కోసం ప్రదక్షణలు
రాజశేఖర్ రెడ్డి ఆశయాలు కాంగ్రెస్ తోనే సాధ్యం
కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉపాధి హామీని నీరుగారుస్తున్నారు
వేల్పూరు రచ్చబండ కార్యక్రమంలో షర్మిల
Congress | శావల్యాపురం,ఆంధ్రప్రభః వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అద్భుతమైన పథకాలను అందించిన ఏకైక నాయకుడు రాజశేఖర్ రెడ్డని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలా అన్నారు. అప్పటి సీఎంగా రాజశేఖర్ రెడ్డి, ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఇప్పటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నీరుగార్చి, ఉపాధి హామీ పథకాన్ని తుంగలో తొక్కలని చూస్తుందని దూయబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీపై నూతనంగా తీసుకువచ్చిన చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు రాష్ట్రంలో షర్మిల చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం కళామందిర్ సెంటర్లో వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బోయపాటి రామాంజనేయులు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం గురువారం నిర్వహించారు.
ఈ రచ్చబండ కార్యక్రమంలో ముందుగా షర్మిల ప్రజలతో మాట్లాడారు. పనికి వెళ్లినా వేతనాలు సకాలంలో పడడం లేదని, పోస్టల్ బ్యాంకులో అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయని ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారని షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా గతంలో పని ప్రదేశాల్లో టెంట్లు, మంచినీరు, పనిముట్లు అందించే వారని ఇప్పుడు చూద్దాం అన్నా ఎక్కడ కనపడట్లేదని వాపోయారు. ఇంకా ఉపాధి హామీ లో ఉన్న అనేక సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆకలి చావులను ఆపి, కరువును, గ్రామాల్లోని వలసలను ఆపడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని బిజెపి ప్రభుత్వం లేకుండా చేయాలని చూస్తోందన్నారు. మహాత్మాగాంధీ పేరును తీసేసి వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (జి.రామ్.జి) పేరుతో కొత్త చట్టం తీసుకువచ్చి పథకాన్ని నీరుగార్చి పేదల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ నిధులను 60 శాతం కేంద్రం ఇచ్చి 40 శాతం రాష్ట్రాలు పెట్టుకోవాలనడం ఈ పథకాన్ని తీసేయాలనే ఉద్దేశం కాదా అని ప్రశ్నించారు. అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా దిగజార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తీరును ఎండగట్టారు.
గతంలో 6 గంటలు ఉన్న పని కాలాన్ని ఇప్పుడు 12 గంటలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గాంధీ ఆశయాలను చంపాలనే ఉద్దేశంతో మోడీ చేస్తున్న కుట్రలు తిప్పి కొట్టాలని ఈ కార్యక్రమానికి నడుం బిగించి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చి ఇప్పుడు డబ్బులు ఇవ్వమని కేంద్రం చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ బిజెపిని భుజస్కంధాలపై మోస్తూ ఉపాధిని నీరు గారుస్తున్నా ఏమీ మాట్లాడకపోవడం వారి భయానికి నిదర్శనమని విమర్శించారు. మన రాష్ట్రానికి నిధులు తేవడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎంపీలు అనేకమంది ఉండి కూడా పార్లమెంటులో ప్రాజెక్టుల గురించి ప్రస్తావనే తీసుకురావడం లేదని దూయబట్టారు.
ప్రజల పక్షాన నిలిచేది ఒక్క కాంగ్రెస్ పార్టీయే అని మిగిలిన పార్టీలన్నీ బీజేపీకి బినామీలుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. గతంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన అనేక పథకాలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాయని, మరలా అవి కొనసాగాలంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అభ్యర్థించారు. రాజశేఖర్ రెడ్డి కూతురు మీద నమ్మకంతో రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మస్తాన్వలి తదితర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


