17th Ward | ఎగిరిన ‘హస్తం’ జెండా!

17th Ward | ఎగిరిన ‘హస్తం’ జెండా!
- బీఆర్ఎస్ వ్యూహాలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెక్..
- క్యాంపు’ రాజకీయాల నడుమ కాంగ్రెస్ పీఠం కైవసం
- చైర్‌పర్సన్‌గా దావ స్వాతి, వైస్ చైర్మన్‌గా రాగంశెట్టి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం
17th Ward | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీలో గత కొద్ది రోజులుగా సాగిన క్యాంపు రాజకీయాలకు సోమవారంతో తెరపడింది. ఉత్కంఠ భరితంగా సాగిన రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ అభ్యర్థి దావ స్వాతి (7వ వార్డు) బాధ్యతలు చేపట్టగా, వైస్ చైర్మన్‌గా రాగంశెట్టి సత్యనారాయణ (17వ వార్డు) ఎన్నికయ్యారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి, సబ్ కలెక్టర్ మనోజ్ సమక్షంలో వీరు ప్రమాణ స్వీకారం చేశారు.
బీఆర్ఎస్‌కు తప్పని భంగపాటు..
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా 14 స్థానాలు గెలుచుకోవడంతో నిన్నటి వరకు చైర్మన్ పీఠం కోసం గట్టి ప్రయత్నాలే చేసింది. ఒక దశలో ఒక కాంగ్రెస్ కౌన్సిలర్, ఒక బీజేపీ కౌన్సిలర్‌ను తమవైపు తిప్పుకున్నామని భావించిన బీఆర్ఎస్‌కు చివరి నిమిషంలో భంగపాటు తప్పలేదు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వ్యూహంతో కాంగ్రెస్ సభ్యులందరూ రహస్య శిబిరానికి తరలివెళ్లారు. సోమవారం ఉదయం శిబిరంలో ఉన్న 18 మంది కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ తమవైపు ఉన్నారని భావించిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ సభ్యులతో కలిసి బస్సు దిగి హస్తం పార్టీకే మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఎన్నికల ప్రక్రియకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడం పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.
21 ఓట్ల భారీ మెజారిటీతో విజయం..
ఎక్స్ ఆఫీసియో సభ్యుడి ఓటుతో కలిపి మొత్తం 21 ఓట్ల మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దావ స్వాతికి మద్దతుగా కాంగ్రెస్ (14), ఇండిపెండెంట్లు (05), బీజేపీ (01), ఎక్స్ ఆఫీసియో సభ్యుడు (01) ఓటు వేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు..
సబ్ కలెక్టర్ సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన వారిలో.. కాంగ్రెస్ నుంచి దావ స్వాతి (7వ వార్డు), నిజాముద్దీన్ (8వ వార్డు), డీకొండ పద్మ (10వ వార్డు), గాలి సుమలత (11వ వార్డు), చింతల వసంత (15వ వార్డు), రాగంశెట్టి సత్యనారాయణ (17వ వార్డు), జంగం కల్పన (23వ వార్డు), దామెర విజయలత (24), కంకటి ప్రణీత (25), ఇప్ప కుమార స్వామి (26), బెత్తి శ్రావణ్ కుమార్ (27వ వార్డు), చిప్ప అర్చన (28వ వార్డు), మేడి పున్నం చందు (29), నీలి హారిక (32). స్వతంత్రులు: నిచ్చకోల వంశీ కృష్ణ (2)వ వార్డు, మత్తమారి రాయమల్లు (16వ వార్డు), పిక్ ఎల్లబాయి (22వ వార్డు), సుభాసిని భరద్వాజ్ (30వ వార్డు), పోలు ఉమాదేవి (33)లతో పాటు బీజేపీ నుంచి కోక్కుల రామ్మూర్తి (34వ వార్డు) ఉన్నారు
మున్సిపల్ చరిత్రలో నవ శకం
1987లో ఇరుగురాల చంద్రశేఖర్ నుండి ప్రారంభమైన బెల్లంపల్లి మున్సిపల్ ప్రస్థానంలో ఇప్పుడు దావ స్వాతి తొమ్మిదవ చైర్‌పర్సన్‌గా నిలిచారు. మూడు దశాబ్దాల తర్వాత ఈ పదవి ‘మహిళా జనరల్’ కు రిజర్వ్ కావడంతో ఆమెకు ఈ అవకాశం దక్కింది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు.
