హైదరాబాద్ -.రైతుబంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసిన జర్నలిస్ట్ రేవతి పొగడదండని పోలీసులు అరెస్ట్ చేశారు. నేటి తెల్లవారుజామున 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో ఆమె ఇంటికి వచ్చారు. ఆ వెంటనే రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్‌లను సీజ్ చేశారు.. మీడియాలోతప్పుడు వార్త ప్రసారం చేసినందుకు అరెస్ట్ చేస్తున్నట్లు ఆమెకు నోటీస్ ఇచ్చారు.. ఆ వెంటనే అమెను అరెస్ట్ చేసిన సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇదే సమయంలో రేవతి నిర్వహిస్తున్న పల్స్ యూట్యూబ్ చానల్ ఆఫీస్‌ను సైతం సీజ్ చేశారు.
రేవతి అరెస్ట్ ను ఖండించిన బి ఆర్ ఎస్ నేతలు
సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఉదయం 5 గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్టు చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనమని విమర్శించారు. రేవతితో పాటు యువ జర్నలిస్టు తన్వీ యాదవ్‌ను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఒక రైతు కాంగ్రెస్ సర్కారులో తను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే ఆ వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ నిర్బంధ పాలనకు పరాకాష్ట అని కేటీఆర్ అన్నారు. ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా , సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమా? నియంతృత్వ రాష్ట్రమా ..
ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమా? నియంతృత్వ రాష్ట్రమా అని నిలదీశారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు. సమస్యలపై నిలదీస్తున్న వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టులతో సమాధానం చెబుతుందని విమర్శించారు.
సీనియర్ జర్నలిస్టు రేవతిని ఉదయం 5 గంటల ప్రాంతంలో అక్రమ అరెస్టు చేయడం చూస్తుంటే.. ఈ ప్రభుత్వం ఎంత అభద్రతాభావం, పిరికితనంతో ఉందో అర్థమవుతుందని హరీశ్‌రావు విమర్శించారు. ప్రశ్నించే గొంతులను, పత్రికా స్వేచ్ఛను అణిచివేయడానికి చేసిన ఈ సిగ్గుచేటు ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.