Mopidevi | పుడమి తల్లిని పరిరక్షించుకోవాలి

Mopidevi | పుడమి తల్లిని పరిరక్షించుకోవాలి
- శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిజీ
- మోపిదేవిలో సుఫల రైతు పాదయాత్ర ప్రారంభం
Mopidevi | మోపిదేవి, ఆంధ్రప్రభ : అందరిని పెంచి పోషించే ఏకైక మాతృమూర్తి అయిన భూమాత (పుడమి తల్లి)ని పరిరక్షించుకోవాలని బాధ్యత మనందరిపై ఉందని త్రిదండి చిన జీయర్ స్వామిజీ పేర్కొన్నారు. వ్యవసాయంలో ఉపాధి అవకాశాలు పెంపొందించాలన్న సంకల్పంలో భాగంగా మన మట్టి, మన ఆరోగ్యం, భూ పరిరక్షణ ధ్యేయంగా త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిజీ చేపట్టిన సుఫల రైతు పాదయాత్రను బుధవారం కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ప్రారంభమైంది. మోపిదేవిలంక, నడిమి లంక, కోసూరువారిపాలెం, మేళ్లమర్తిలంక, ఉత్తరచిరువోల లంక మీదుగా అయోధ్య కోనేరు కరుణాకర్ వ్యవసాయ క్షేత్రం వరకు పాదయాత్రను నిర్వహించారు.

ఆయా గ్రామాల్లో గో ఆధారిత వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి దేశీయ విత నం, దేశవాళి ఆవు, మన నంది కోసం రైతులను చైతన్యపరుస్తూ భవిష్యత్ తరాల వారికి వ్యవసాయం యొక్క విలువ తెలియజేయటం, వ్యవసాయం చేసే రైతులకు ఆదాయం, ఆరోగ్యం పెంచాలన్న సంకల్పంతో కృష్ణా మిల్క్ యూనియన్ సహకారంతో పాదయాత్రను కొనసాగించినట్లు చిన్నజీయర్ స్వామి తెలిపారు. పాదాలకు చెప్పులు ధరించకుండా 8 కిలోమీటర్ల మేర కాలినడకన అయోధ్య వరకు వెళ్లారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ఆధారంగా పుడమిని పరిరక్షించుకోవచ్చునని తెలిపారు. రసాయన ఎరువుల వాడకం ద్వారా భూమి సారం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

రైతులకు మేలు చేసే విధంగా సుఫల’ రైతు పాదయాత్ర చేపట్టామని తెలిపారు. భద్రాచలం శ్రీభద్రాద్రి రామాలయం నిర్మించిన భక్త రామదాసు స్వగ్రామం నేలకొండపల్లి నుంచి మొదటి పాదయాత్ర చేశామని, రెండవ పాదయాత్ర మోపిదేవి నుంచి ప్రారంభించటం జరిగిందని తెలిపార . ఈ పాదయాత్ర కేవలం మన అమ్మ, మన తల్లి కోసం, మన భూమి కోసం, మన తల్లికి ఆనందాన్ని కలిగించటం కోసం, తల్లి ఆరోగ్యం బాగుపడటం కోసం చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, శుభకర్ పాలేకర్ స్వచ్చంద సంస్థ అధ్యక్షులు విజయ రామ్, ప్రకృతి వ్యవసాయ రైతులు కొనేరు కరుణాకర్, గోళ్ల పూర్ణ మల్లిఖార్జునరావు, తహసీల్దార్ హరనాద్, రావి నాగేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

