Price | బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోయాయి? జ్యోతిష్య కారణాల విశ్లేషణ

Price | బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోయాయి? జ్యోతిష్య కారణాల విశ్లేషణ
- బంగారం, వెండి ధరల అకస్మాత్తు పతనం
- ఫిబ్రవరి 2026 గ్రహ స్థితులు – జ్యోతిష్య దృష్టికోణం
- బుధ–రాహు కలయిక ప్రభావం మార్కెట్లపై
- గురువుపై రాహు దృష్టి: బంగారం ఎందుకు క్షీణించింది?
- రవి–కుజుల మధ్య నలిగిన శుక్రుడు: వెండి ధరల పతనం
- వరాహమిహిర బృహత్సంహిత శ్లోక ప్రామాణ్యం
- రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలపై ప్రభావం
(వ్యాసకర్త: సాయి ధీరజ్ శర్మ జల్లవరపు- స్మార్త జ్యోతిష పండితులు)
Price | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూడటం మార్కెట్ వర్గాలను, సామాన్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతర్జాతీయ మార్కెట్ సూత్రాలు దీనికి పలు కారణాలు చెబుతున్నప్పటికీ, కాల పురుషుని గడియారం ప్రకారం.. అంటే జ్యోతిష్య శాస్త్ర రీత్యా (Astrological Perspective) గ్రహాల సంచారంలో వచ్చిన ఆకస్మిక మార్పులే ఈ పతనానికి అసలు కారణమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం “ఫిబ్రవరి 2026” గ్రహ స్థితులను పరిశీలిస్తే, సువర్ణ (Gold), రజత (Silver) కారక గ్రహాలు తీవ్రమైన పీడలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఆ విశ్లేషణ ఇక్కడ ఉంది.

- వ్యాపార కారకుడిపై రాహువు ప్రభావం (Mercury & Rahu):
మార్కెట్ హెచ్చుతగ్గులను శాసించే వ్యాపార కారకుడు ‘బుధుడు’ (Mercury). ఈ బుధుడు ఫిబ్రవరి 3న కుంభ రాశిలోకి (Aquarius) ప్రవేశించాడు. అక్కడ అప్పటికే తిష్టవేసి ఉన్న ఛాయా గ్రహం ‘రాహువు’తో కలవడం ఒక “ట్రిగ్గర్ పాయింట్”. జ్యోతిషంలో బుధ-రాహువుల కలయిక ఎప్పుడూ ఊహించని పరిణామాలకు (Unpredictable Volatility) దారితీస్తుంది. ఇది మార్కెట్‌లో సడన్ క్రాష్‌ను సృష్టించింది.
- బంగారం (గురువు)పై రాహు దృష్టి:
బంగారానికి కారకుడు బృహస్పతి (Jupiter). ప్రస్తుతం గురువు మిథున రాశిలో (Gemini) సంచరిస్తున్నాడు. అయితే కుంభ రాశిలో ఉన్న రాహువు, తన పంచమ దృష్టితో (5th Aspect) గురువును చూడటం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎప్పుడైతే రాహువు వంటి పాప గ్రహ దృష్టి గురువుపై పడుతుందో, అప్పుడు పసిడి ధరల్లో స్థిరత్వం లోపించి, ఒక్కసారిగా పతనం సంభవిస్తుంది.
- పాప గ్రహాల మధ్య నలిగిన వెండి (Venus in Affliction):
ఇక వెండి విషయానికి వస్తే.. వెండికి కారకుడు శుక్రుడు (Venus). ప్రస్తుతం శుక్రుడు మకర రాశిలో ఉన్నాడు. కానీ ఆయన ఒంటరిగా లేడు. అత్యంత ఉష్ణ గ్రహాలైన రవి (Sun) మరియు కుజుడు (Mars) తో కలిసి ఉన్నాడు. అగ్ని తత్వం కలిగిన రవి, కుజుల మధ్య జల తత్వ గ్రహమైన శుక్రుడు ఇరుక్కుపోవడం, అందునా రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం (Combustion) చెందడం వల్ల వెండి తన ప్రభను కోల్పోయింది. అందుకే వెండి ధరలు ఇంతలా ప్రభావితమయ్యాయి.
ప్రమాణ శ్లోకం:
ఈ గ్రహ స్థితుల ప్రభావాన్ని వరాహమిహిరుడు తన “బృహత్సంహిత” గ్రంథంలోని ‘అర్ఘ్య కాండం’ లో స్పష్టంగా వివరించాడు.
శ్లో|| క్రూరైః పాపైః యుతే దృష్టే సౌమ్యే వా అస్తంగతే సతి | ధాతునాం రసవస్తునాం అర్ఘహానిః ప్రజాయతే ||
భావం: ఎప్పుడైతే శుభ గ్రహాలు (గురువు, శుక్రుడు వంటివి) క్రూర లేదా పాప గ్రహాలచే (రాహువు, కుజుడు, రవి) చూడబడతాయో, లేదా వాటితో కలిసి అస్తంగత్వం పొందుతాయో.. అప్పుడు లోహాలు (Metals) మరియు రస వస్తువుల ధరలలో ‘హాని’ (అంటే భారీ తగ్గుదల) సంభవిస్తుంది.
ముగింపు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రవి కుంభంలోకి మారే వరకు (ఫిబ్రవరి 13) ఈ ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉంది. వ్యాపారపరంగా చూస్తే ఇది ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగించినా, సామాన్యులకు మాత్రం ఇది ఊరటనిచ్చే పరిణామమే.

