గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. ఈ రోజుతో ఆయన రిమాండ్ ముగియనుండటంతో రోజు ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీని పోలీసులు వర్చువల్ గా ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఈ నెల 25 వరకు వంశీ రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంలో పని చేసిన కంప్యూటర్ ఆపరేటర్‌ను కిడ్నాప్ చేసి, బెదిరింపులకు దిగిన కేసులో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులను విజయవాడ కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. తమకు బెయిల్ ఇవ్వాలని వంశీతో పాటు ఆయన అనుచరులు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే వారిని పోలీసులు ఓ సారి కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో 2023లో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. అప్పట్లో ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వం ఈ కేసులను పట్టించుకోలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసును రీఓపెన్ చేసింది. ఈ కేసులో ఏ71గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కాకుండా కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు.