Nettem Raghuram | అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలి..

Nettem Raghuram | అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలి..
- సీఎం పై అవమానకర వ్యాఖ్యలు
- మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం
Nettem Raghuram | ఆంధ్రప్రభ విజయవాడ : వైకాపా నేత అంబటి రాంబాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చేసిన అసభ్య, అవమానకర వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుత ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన వ్యక్తి స్థాయి లేని వ్యక్తిగత దూషణలకు దిగడం, వైకాపా రాజకీయ సంస్కృతి ఎంత దిగజారిపోయిందో బహిరంగంగా చూపుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో విధానాలపై విమర్శలు, రాజకీయ విభేదాలు సహజమని, కానీ వ్యక్తిగత అవమానాలు, నీచ పదజాలం, వ్యక్తిత్వ దూషణలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని రఘురాం స్పష్టం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం కేవలం వ్యక్తిగత దూషణ మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థపైనే అవమానం అని అన్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన ఒక్కరే కాదు, ఆ రాజకీయ వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా బాధ్యత వహించాలని రఘురాం డిమాండ్ చేశారు.
పార్టీ నాయకులు ఎంత నీచంగా మాట్లాడినా వారిని అడ్డుకోకుండా మౌనం పాటించడం జగన్ నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. వైకాపా ఎదుర్కొన్న ఘోర ఓటమికి కారణం ప్రజలు కాదని, వారి నాయకుల అహంకారం, అసహనం, దూషణల రాజకీయాలు, ప్రజా వ్యతిరేక ధోరణులేనని రఘురాం స్పష్టం చేశారు. ప్రజలను నిందించడం రాజకీయ పరాజయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం మాత్రమేనని వ్యాఖ్యానించారు. వైకాపాకు శత్రువు బయట ఎక్కడో లేడని, వారి నాయకుల ప్రవర్తనే ఆ పార్టీకి అతిపెద్ద శత్రువని, అద్దంలో చూసుకుంటేనే వారి పతనానికి కారణం స్పష్టంగా కనిపిస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగబద్ధ పదవులను అవమానించే వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేసి, ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేయాలి. లేకపోతే ఇటువంటి రాజకీయ దూషణలకు ప్రోత్సాహం ఇచ్చినట్లే అవుతుంది. చట్టం ముందు అందరూ సమానమనే సూత్రాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని రఘురాం స్పష్టం చేశారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ తరఫున ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి నెట్టెం రఘురాం గారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో మాటలకు బాధ్యత ఉండాలని, రాజకీయాలు విలువలతో నడవాలని ఆయన స్పష్టం చేశారు.
