MLA | మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

MLA | మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం
- మార్నింగ్ వాక్‌లో మాజీ ఎమ్మెల్యే ఎస్.ఆర్. రెడ్డి ఆగ్రహం
MLA | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి (ఎస్.ఆర్. రెడ్డి) మార్నింగ్ వాక్ చేస్తూ పార్కుల దుస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్, సైన్స్ పార్క్‌లలో కొంతసేపు నడుచుకుంటూ ఆరోగ్యం కోసం వచ్చిన వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్లను పలకరించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్కుల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందని ఆయన మండిపడ్డారు.
కనీస స్థాయిలో కూడా మెయింటెనెన్స్ చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. తాగునీరు, నీడ, వాకింగ్ ట్రాక్‌లు, శుభ్రత వంటి మౌలిక సదుపాయాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పార్కుల అభివృద్ధి, నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన పార్కులను నిర్లక్ష్యం చేయడం ప్రజల పట్ల చేసిన అన్యాయమని అన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ.. నారాయణపేట అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు ఒక్కసారి గుర్తుచేసుకుని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పార్కుల దుస్థితి నారాయణపేట అభివృద్ధిపై మున్సిపల్ పాలకుల వైఫల్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై తాము ఎప్పటికీ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు విజయసాగర్, చెన్నారెడ్డి, సుదర్శన్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి, సురేందర్ రెడ్డి, బోయ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
