హైదరాబాద్ : సమానత్వం మహిళా దినోత్సవ ముఖ్య ఉద్దేశమని మంత్రి సీతక్క అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి రన్ ఫర్ యాక్షన్-2025 నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళలంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేదన్నారు. మహిళలు, పురుషులకి మధ్య సామర్థ్యాల్లో తేడాలేమీ లేవని.. అందరూ సమానమే అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
.”మహిళల భద్రత కోసం పోలీసులు కృషి చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాల కోసం ఇతర దేశాల నుంచి హైదరాబాద్ వస్తున్నవారు ప్రశాంతంగా ఉంటున్నారంటే కారణం పోలీసులు. పురుషుడు ప్రతి మహిళను తమ ఇంట్లో ఒక ఆడబిడ్డలా చూస్తే వారు క్షేమంగా ఇంటికి తిరిగి రాగలుగుతారు. ఇటీవలి కాలంలో మత్తు మన జీవితాలను చిత్తు చేస్తోంది.. మన గౌరవాన్ని తగ్గిస్తోంది. మాదకద్రవ్యాల నుంచి ఈ సమాజాన్ని చైతన్యవంతంగా మార్చాలి. మహిళల రక్షణకు, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మహిళలను ఎదగనిద్దాం.. గౌరవిద్దాం.. ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరగనిద్దాం” అని సీతక్క తెలిపారు.
సీతక్క వుమెన్ ఆఫ్ స్ట్రగుల్: సీవీ ఆనంద్
మంత్రి సీతక్క వుమెన్ ఆఫ్ స్ట్రగుల్ అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కొనియాడారు. ఆమె అందరికీ ఆదర్శమని చెప్పారు. కమిషనరేట్ పరిధిలో 20 మంది డీసీపీల్లో 8 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో ఇటీవల మహిళా ఎస్‌హెచ్‌వోలను నియమించినట్లు చెప్పారు. కమిషనరేట్‌లో 18 వేల మంది పోలీసు సిబ్బందిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారన్నారు. ఇవన్నీ మహిళల ఉన్నతికి నిదర్శనమని సీపీ వివరించారు