Collector | సంజీవని ప్రాజెక్టు అమలు

Collector | సంజీవని ప్రాజెక్టు అమలు

  • ఫిబ్రవరి నుంచి జిల్లా వ్యాప్తంగా..
  • ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకం రూ.25 లక్షలకు పెంపు
  • అభివృద్ధి సంక్షేమంలో జిల్లా అగ్రగామి
  • గణతంత్ర దినోత్సవ వేడుకలలో కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి

Collector | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ తుషార్ దుడీ పాల్గొన్నారు. జాతీయ పతాకావిష్కరణకు ముందు జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక పరిశీలన వాహనంలో పోలీస్ పరేడ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, విలువలు మనందరికీ శాశ్వత మార్గదర్శకాలని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకనుగుణంగా సమిష్టి కృషితో చిత్తూరు జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నామని స్పష్టం చేశారు.

ఆరోగ్య రంగంలో సంజీవని ప్రాజెక్ట్ ఒక కీలకమైన, విప్లవాత్మక ముందడుగుగా నిలుస్తోందని కలెక్టర్ వెల్లడించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి మొదటి వారం నుంచి జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రోగుల వైద్య చరిత్రను పూర్తిగా డిజిటల్ రూపంలో భద్రపరచి, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఒకే విధమైన వైద్య సమాచారం అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

దీని వల్ల రోగులు ఆసుపత్రులు మారినప్పటికీ వైద్య వివరాలు తక్షణమే లభించి, చికిత్సలో జాప్యం తగ్గడంతో పాటు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వివరించారు. అదేవిధంగా పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకాన్ని మరింత బలోపేతం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ పథకం కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు.

జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 1,08,631 మంది లబ్ధిదారులకు రూ.203 కోట్ల విలువైన వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. మహిళా సాధికారత దిశగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ద్వారా జిల్లాలో కోటి మందికిపైగా మహిళలు లబ్ధి పొందారని, ఇప్పటి వరకు సుమారు రూ.39 కోట్ల మేర రవాణా చార్జీలు ఆదా అయ్యాయని వివరించారు.

సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లను రూ.4,000కు పెంచి, 2025 ఏప్రిల్ నుంచి 2026 జనవరి వరకు జిల్లాలో రూ.1,117.50 కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యారంగంలో తల్లికి వందనం పథకం ద్వారా రూ.335 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామని, మెగా డీఎస్సీ ద్వారా 1,394 మంది ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి చేసినట్లు చెప్పారు.

వ్యవసాయ రంగంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు. గృహ నిర్మాణంలో పీఎంఏవై పథకం కింద జిల్లాలో 53,723 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. తాగునీరు, రహదారులు, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి హామీ పథకాల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించినట్లు వివరించారు.

ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా అధికారులకు, సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, పూతలపట్టు మురళీమోహన్, జీడి నెల్లూరు థామస్, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, డీఆర్వో మోహన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, ఎమ్మార్వో కులశేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply