AV Ranganath | హైడ్రా దూకుడుగానే ముందుకు…

AV Ranganath | హైడ్రా దూకుడుగానే ముందుకు…

పేదల గృహాలను కూల్చే ఉద్దేశం హైడ్రాకు లేదు
పేదలను ముందు పెట్టి కబ్జాలకు పాల్పడే పెద్దలను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు
చెరువుల ఆక్రమణను అడ్డుకోవటమే కాదు.. వాటిని ఆరోగ్యకరమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం
చెరువులు ఇకపై పిల్లలకు, యువతకు, పెద్దల ఆరోగ్యానికి క్రీడలకు ఆలవాలంగా మారుస్తాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టీకరణ


AV Ranganath | హైదరాబాద్, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ, చెరువుల అక్రమణల తొలగింపుల్లో హైడ్రా ఇక ముందు కూడా దూకుడుగానే ముందుకు పోతుందని, పేదల ఇళ్లను హైడ్రా కూల్చదని, అదే సమయంలో పేదలను ముందు పెట్టి ఆక్రమణలు చేసే పెద్దలను వదిలిపెట్టే సమస్య లేదని హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్ (AV Ranganath) స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో రెడ్ హిల్స్ లో హరిత చైతన్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి మాజీ ఉద్యోగుల సమ్మేళనం (Singareni former employees association) లో ఆయన ప్రసంగించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెరువుల్లో ఆక్రమణల తొలగింపు ఒకటే తమ లక్ష్యం కాదని, విషతుల్యంగా మారిన చెరువులను శుభ్రపరుస్తున్నామని, తద్వారా గుర్రపు డెక్క వంటి చెట్లు మొలవకుండా శుభ్రమైన నీరు చెరువులో ఉండే విధంగా చూస్తున్నామన్నారు. అంతేకాక చెరువుల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వాకింగ్ ట్రాక్ (Walking track) లుగా చిన్న పిల్లలు, యువత ఆడుకునే క్రీడా మైదానాలుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని చెరువులను ఈ విధంగా రూపుదిద్దామని, మరికొన్ని చెరువులను త్వరలో చేపడుతున్నామన్నారు.

ఇప్పటివరకు హైడ్రా అనేక ఆక్రమణలు తొలగించి వందలాది ఎకరాల ప్రభుత్వ ఆస్తులను రక్షించిందని, సుమారు 2000 ఎకరాల ఆక్రమణలను తొలగించాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, తద్వారా లక్ష కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు రక్షించినట్లు అవుతుందని ఆయన వివరించారు. సింగరేణి మాజీ ఉద్యోగులు ఈ విధంగా హరిత చైతన్య కళాక్షేత్రం పేరుతో పర్యావరణ హితం కోసం పాల్గొనడం ఎంతో సంతోషమని ఆయన ప్రశంసలు కురిపించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ అటవీ శాఖ (Central Environment Forest Department) అడ్వైజర్ అండ్ సీనియర్ సైంటిస్ట్ తరుణ్ కత్తుల మాట్లాడుతూ… ప్రస్తుతం భారతదేశం తీవ్ర వాతావరణ కాలుష్యంతో బాధపడుతున్న విషయాన్ని గుర్తించి, ప్రతి ఒక్కరూ కాలుష్య నివారణకు తమ వంతు బాధ్యతగా ముందుకు కదలాలన్నారు.

రాష్ట్రపొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సీనియర్ సోషల్ సైంటిస్ట్ శ్రవణ్ కుమార్ (Shravan Kumar) మాట్లాడుతూ… ప్రతి జీవి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు పర్యావరణకు హాని కలిగించే విధంగానే వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి మారాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు చైతన్యవంతులు అవ్వాలని సీనియర్ సిటిజన్లు తమ మనవళ్లకు, బిడ్డలకు ఈ విషయంలో మార్గదర్శకంగా నిలవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని సమూలంగా నిర్మూలించాలని కోరారు.

ఈకార్యక్రమంలో సింగరేణి సంస్థ (Singareni Institute) మాజీ డైరెక్టర్లు జేవీ దత్తాత్రేయులు, ఏ మనోహర్, ఎస్ చంద్రశేఖర్, జీవీ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. హరిత చైతన్య కళాక్షేత్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు గణాశంకర్ పూజారి తమ సంస్థ ఉద్దేశాలను వివరిస్తూ… పాటల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పర్యావరణ చైతన్యం తీసుకురావడం కోసం కృషి చేస్తున్నామన్నారు. అనంతరం జరిగిన సంగీత విభావరి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

Leave a Reply