VOTE | ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి

VOTE | ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి

  • జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ పిలుపు

VOTE | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటు హక్కు భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు.

ప్రతి ఓటరు తన ఓటును వినియోగించే సమయంలో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారానే దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుందన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకులను ఎన్నుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు. కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమానంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం భారతదేశంలో ఉందని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలన్నారు.

ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమైందని, భారీ మెజార్టీతో గెలిచినా, ఒక్క ఓటు తేడాతో గెలిచినా విజయం విజయ‌మేన‌ని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనిలో ఓటరుకు ప్రత్యేక స్థానం ఉందని, ఓటు ఒక వజ్రాయుధమని తెలిపారు. అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ… 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి యువత బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్ఓలు)ను సంప్రదించి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని, పేద–ధనిక, చదువున్నవారు లేనివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఓటు సమాన హక్కుగా లభిస్తుందని పేర్కొన్నారు. ఓటు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి జీవితంలో అదృష్టంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పీ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయ్యాయని, దేశంలో తొలి ఎన్నికలు 1950లో జరిగాయని తెలిపారు.

2011 సంవత్సరంలో తొలిసారిగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైందన్నారు. ఓటరుగా నమోదు అయిన తరువాత హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తుంచుకోవాలని, తమతో పాటు ఇతరులను కూడా ఓటు వినియోగించుకునేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మీ, డిఈఓ రాజేంద్రప్రసాద్, పీఓ ఎస్సీఎస్ఎ వెంకటరమణ, అర్బన్ ఎంఆర్‌ఓ కులశేఖర్, రూరల్ ఎంఆర్‌ఓ కళ్యాణి, సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, కాంగ్రెస్ నాయకులు పరదేశి, జిల్లా అధికారులు, బీఎల్ఓలు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply