Somashila | సౌందర్యం.. పర్యాటకానికి మణిహారం

Somashila | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిది, ఆంధ్రప్రభ : నల్లమల అడవుల మధ్య కృష్ణమ్మ ఒడిలో ఒదిగి ఉన్న సోమశిల పర్యాటక కేంద్రం ఆధ్యాత్మికతకు, ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన గమ్యస్థానమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం సోమశిల ఎకో టూరిజం పార్కును మంత్రి సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి కృష్ణా నది, ప్రకృతి అందాలను వీక్షించారు.

Somashila

ఈ సందర్భంగా సోమశిల తీరం నుంచి ఎకో పార్కు వరకు మంత్రి బోటులో విహరించారు. అక్కడి ప్రకృతి అందాలను, అటవీ, పర్యాటక శాఖ కల్పిస్తున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సోమశిల – శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్ లో ప్రకృతి అందాలు పర్యాటక ప్రేమికుల్ని సరికొత్త అనుభూతిని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇక్కడి వ్యూ పాయింట్ వద్ద ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయని, ముఖ్యంగా ఎకో పార్కు పరిసరాల్లోకి అప్పుడప్పుడు పులులు వంటి వన్యప్రాణులు రావడం ఇక్కడి పర్యాటకానికి మరింత ఆకర్షణను తెస్తుందని వివరించారు.

తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు, దేశ విదేశీ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేలా సోమశిలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. సోమశిల ప్రాంతం కేవలం విహారకేంద్రంగానే కాకుండా 15 శివాలయాల సముదాయంతో ఆధ్యాత్మిక క్షేత్రంగానూ అలరారుతోందని ఆయన గుర్తు చేశారు.

Somashila

పర్యాటకుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) సోమశిల నుండి శ్రీశైలం వరకు ఐదు గంటల పాటు సాగే ప్రత్యేక బోటింగ్ సేవలను అందిస్తోందని, ఈ ప్రయాణంలో నదీ తీర అందాలను చూస్తూ సాగే ప్రయాణం మధురానుభూతిని కలిగిస్తుందని చెప్పారు.

Somashila

ఈ ప్రాంతంలో ఉన్న హరిత – మృగవాణి రిసార్ట్స్ పర్యాటకులు బస చేయడానికి అద్భుతమైన వసతి కల్పిస్తున్నాయని, సమీపంలోని మల్లెల తీర్థం, పాలధార, పంచదార వంటి జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పర్యాటక సంపదను ప్రపంచానికి పరిచయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

Leave a Reply