Yedapally | పీపీని సన్మానించిన మీడియా ప్రతినిధులు

Yedapally | పీపీని సన్మానించిన మీడియా ప్రతినిధులు

Yedapally | ఎడపల్లి, ఆంధ్రప్రభ : బోధన్ న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పదోన్నతి పొందిన ముస్కు గంగారెడ్డిని ఎడపల్లి  మండల పాత్రికేయులు, మండలం స్థాయి అధికారులు, ఆర్టీఐ సంస్థ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఆర్.టి.ఐ మీడియా ప్రతినిధి భుజంగం లింగం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోనీ మండల పరిషత్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఎడపల్లి తహసిల్దార్ దత్తాత్రి, మండల పరిషత్ కార్యాలయ అధికారి శంకర్, ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి, ఎడపల్లి మండల పాత్రికేయులు, పలువురు గ్రామ పెద్దలు ముస్కు గంగారెడ్డిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా పి.పి గంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించడంలో ఆర్టీఐ చట్టం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. సమాజంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలంటే పాత్రికేయుల సేవలు అత్యంత అవసరమని స్పష్టం చేశారు. అలాగే మీడియా ప్రశ్నించే స్వభావమే ప్రజాస్వామ్యానికి బలమని అభిప్రాయపడ్డారు. పాత్రికేయులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, పాత్రికేయ వృత్తి కత్తి మీద సాము లాంటిదని, కొన్ని సందర్భాలలో పాత్రికేయులు సైతం అనుకోని అవాంతరాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, నీతికి న్యాయానికి కట్టుబడి ఉన్న పాత్రికేయులను ఏ శక్తి అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన పాత్రికేయులకు న్యాయ సమస్యలపై సలహాలు ఇచ్చేందుకు తాను ఎప్పటికీ సంసిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. తనను అభినందించిన ఎడపల్లి మండల పాత్రికేయులతో పాటు అధికారులకు గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఐ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి కందకుర్తి రామకృష్ణ గుప్తా, బోధన్ టౌన్ ప్రెసిడెంట్ పురం శేఖర్,ఎడపల్లి మండల పాత్రికేయులు, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply