Trump | సుంకాల తగ్గింపునకు సుముఖం

సుంకాల తగ్గింపునకు సుముఖం
Trump | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : రష్యా నుంచి డిస్కౌంట్ పై చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్ని రోజులు భారత్‌పై గుర్రుగా ఉన్నాడు. ఈ కోపంతో భారత్ పై 50 శాతం సుంకాల విధిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. ఇందులో 25 శాతం ప్రత్యక్ష సుంకాలు కాగా.. మరో 25 శాతం జరిమానా సుంకాలు విధించాడు. వీటిని తగ్గించాలంటూ భారత్ ఎన్నిసార్లు విన్నవించినా ట్రంప్ పట్టించుకోలేదు. అయితే తాజాగా ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా శాంతి బోర్డులో చేరేందుకు ఆహ్వానం అందినా భారత్ పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోవడం, అదే సమయంలో రష్యాతో చమురు దిగ్గుమతుల్ని సైతం తగ్గించుకోవడం చర్చనీయాంశమైంది. ఈ రెండు అంశాలు ట్రంప్ ను ఆలోచనలోకి నెట్టాయి. అలాగే భారత్ తో వాణిజ్య ఒప్పందం కూడా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా ముందుకు సాగడం లేదు. దీంతో ట్రంప్ తన మొండి పట్టును వీడాడు.

భారత్ పై గతేడాది విధించిన 50 శాతం పన్నుల్లో సగానికి సగం తగ్గించాలని ట్రంప్ భావిస్తున్నట్లు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బ్రెస్సెంట్ వెల్లడించారు. రష్యా నుంచి చమురు దిగుమతుల్ని తగ్గించుకోవడం వల్ల భారత్ పై సుంకాల్ని సగం తగ్గించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రష్యా చమురు దిగుమతులను తగ్గించాలనే భారతదేశం యొక్క చర్య ప్రస్తుతం భారతీయ వస్తువులపై విధిస్తున్న మొత్తం 50 శాతం సుంకాలలో కనీసం 25 శాతం పాయింట్లను తగ్గించడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించిందని అన్నారు. భారతదేశంపై మా 25 శాతం సుంకం భారీ విజయాన్ని సాధించింది.

రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అదనపు సుంకాలు (25 శాతం) విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికా కు భారత ఎగుమతులపై 50 శాతం సుంకాలు అమలవుతున్నాయి. భారత్‌పై విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సూచనప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. “రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం సుంకాలు విధించాం. అయితే రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకుంది. అది భారీ విజయం. ఇప్పటికీ టారిప్‌లు అమల్లో ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని నేను అనుకుంటున్నాను” అని సుంకాల తొలగింపు గురించి పరోక్షంగా వెల్లడించారు.

కొన్నిరోజుల క్రితం అమెరికా వాణిజ్యమంత్రి హొవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. భారత్‌లో వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదన్నారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణం అని చెప్పారు.
