warm welcome | బ్రహ్మానందంకు ఘన స్వాగతం..

warm welcome | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : తెలుగు చిత్రసీమలో హాస్యానికి కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రముఖ నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం‌కు ఘన స్వాగతం లభించింది. ఈ రోజు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ సహాయ కార్యదర్శి శేష శయన రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందం‌తో కొద్దిసేపు స్నేహపూర్వకంగా మాట్లాడి, ఆయన ఆరోగ్యం, కళారంగ ప్రయాణం తదితర అంశాలపై ఆసక్తికర చర్చ జరిపారు. ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణానికి చేరుకోనున్నారు. పెనుకొండలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మకమైన ‘అనంత ఆణిముత్యాలు’ అవార్డు ఫంక్షన్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం ప్రసంగిస్తూ కళ, సాహిత్యం, సామాజిక బాధ్యతలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన బ్రహ్మానందం హాస్య పాత్రలతో పాటు విలక్షణ నటనతో ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నారు.

అలాంటి మహానటుడు పెనుకొండకు రావడం జిల్లావాసులకు గర్వకారణమని అభిమానులు పేర్కొన్నారు. ఆయన రాకతో పెనుకొండ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొనగా, అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది. ‘అనంత ఆణిముత్యాలు’ అవార్డు ఫంక్షన్ విజయవంతం కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Leave a Reply