POLICE | ప్రజా సంఘాల నేతల అరెస్ట్…

POLICE | ప్రజా సంఘాల నేతల అరెస్ట్…
- అర్ధరాత్రి 2 గంటలకు వివిధ ప్రాంతాలలో అరెస్టు చేసిన స్పెషల్ పార్టీ పోలీసులు
- తక్షణమే విడుదల చేయాలని కుటుంబ సభ్యులు ప్రజాసంఘాల నేతల డిమాండ్
POLICE | అమ్రాబాద్, ఆంధ్రప్రభ : నల్లమల్ల ప్రాంతంలోని వివిధ మండలాలలో ఉన్న ప్రజా సంఘాల నేతలను ఈ రోజు తెల్లవారుజామున స్పెషల్ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జక్కా బాలయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు ఎడ్ల అంబయ్య, యాదయ్యలను హైదరాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… రాష్ట్ర పౌర హక్కుల సంఘం సహాయ కార్యదర్శి జక్కా బాలయ్య స్వగ్రామం మన్ననూరులో ఇంటిలో నిద్రిస్తుండగా వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఉడిమిళ్ళ గ్రామం నుండి వచ్చినట్లు తెలిపారని పేర్కొన్నారు. వెంటనే జక్క బాలయ్యను వాహనంలో ఎక్కించుకొని వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకున్నట్లు తెలిపారు.
అలాగే అచ్చంపేటలో ఉంటున్న పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన సైతం అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదేవిధంగా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన యాదయ్య ఇంట్లో ఉండగా స్థానిక పోలీసుల సహకారంతో స్పెషల్ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకొని సొంత వాహనాన్ని కూడా తీసుకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి వేళల్లో కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రయత్నించిన లభించలేదు. దీంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే వారిని హైదరాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం హైదరాబాద్ కు తరలించినట్లు తెలిసిందని వారు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులు ఎటువంటి నేర చరిత్ర లేకుండా పనులు చేసుకుని జీవిస్తున్నారని వారిని తక్షణమే వదిలిపెట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రజా సంఘాల నేతలను తక్షణమే విడుదల చేయాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సంఘాల నేతల అరెస్టు విషయం ను అమ్రాబాద్ సిఐని వివరణ కోరగా తమకు సమాచారం లేదని పేర్కొన్నారు.
