Chittoor | మాతా, శిశు మరణాల నివారణకు చర్యలు

Chittoor | మాతా, శిశు మరణాల నివారణకు చర్యలు

  • జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షలో డాక్టర్ హనుమంతరావు

Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో మాతా, శిశు మరణాలను పూర్తిగా నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.టి. సుధారాణి ఆదేశాల మేరకు డీఐఓ డాక్టర్ హనుమంతరావు తెలిపారు. డిసెంబర్ నెలలో నమోదైన 12 శిశు మరణాలు, రెండు మాతృ మరణాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బందితో ప్రత్యక్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గర్భస్థ సమయం నుంచి ప్రతి గర్భిణికి 1000 రోజుల కేర్ అత్యంత అవసరమని తెలిపారు. ముఖ్యంగా హై రిస్క్ గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

గర్భం ధరించినప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు తప్పనిసరిగా నాలుగు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించి, పౌష్టికాహారం, రక్తహీనత, హై రిస్క్ లక్షణాలపై నిరంతరం చికిత్స అందించాలన్నారు. అవసరమైతే పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేసి సురక్షితమైన కాన్పు జరిగేలా చూడాలని సూచించారు. బాల్య వివాహాలు జరగకుండా, టీనేజ్ ప్రెగ్నెన్సీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రతి నెల 9వ తేదీన పిహెచ్సీలలో జరిగే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో అన్ని గర్భిణీ స్త్రీలకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించి, పౌష్టికాహారం పై సూచనలు ఇచ్చి అవసరమైన మందులు పంపిణీ చేయాలని తెలిపారు.

గుండె జబ్బులు, థైరాయిడ్, బీపీ, షుగర్ వంటి క్లిష్టతర సమస్యలు ఉన్న గర్భిణీలకు ప్రత్యేక చికిత్స అందించాలని, హై రిస్క్ కేసులను ముందుగానే గుర్తించి, ఒక వారం ముందే ఆసుపత్రిలో చేర్పించి సురక్షిత కాన్పు జరిగేలా చూడాలని సూచించారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువులు లేదా చిన్న సమస్యలు ఉన్న బిడ్డలను వెంటనే పిల్లల వైద్యుడి వద్దకు పంపించి చికిత్స చేయించాలని తెలిపారు. ప్రతిరోజూ ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు గర్భిణీలపై ప్రత్యేక నిఘా ఉంచి జాగ్రత్తలు తీసుకుంటే శిశు మరణాలను నివారించవచ్చని పేర్కొన్నారు.

అలాగే శిశువులను 13 ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడేందుకు డ్యూ డేట్ ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలన్నారు. టీకాల వల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరిగి శిశు మరణాలు తగ్గుతాయని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో డాక్టర్ ఉషశ్రీ, డాక్టర్ లత, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ గోకుల్ కుమార్, డాక్టర్ అనిల్ బాబు, డాక్టర్ శ్రీలత, డాక్టర్ సారుక్, డాక్టర్ అనూష, రోజారాణి, వెంకటేశ్వరి, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply