Tributes | తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్

Tributes | తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్
- ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ పార్టీ నాయకులు ఆరెం రామయ్య నివాళి
Tributes | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నిలిపేందుకు సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారని తెలుగుదేశం పార్టీ వైరా నియోజకవర్గం నాయకులు అరెం రామయ్య నివాళులర్పించారు. ఇవాళ ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆరెం రామయ్య, ఏన్కూర్ మాజీ ఎంపీపీ అరెం వరలక్ష్మీ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల అబివృద్ధి, సంక్షేమానికి ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్ర ప్రజల ఆదరణతో టీడీపీ పార్టీ ఘన విజయం సాధించిందన్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్టీ రామారావు రెండు రూపాయలకు కేజీ బియ్యం, పక్కా గృహాల నిర్మాణం, వ్యవసాయ విద్యుత్ పంపులకు విద్యుత్ రాయితీ, జనతా వస్త్రాలు పంపిణీ పథకాలను ప్రారంభించారన్నారు. పేద ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ స్థిర స్థాయిగా నిలిచిపోయిందని రామయ్య కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని టీడీపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జూలూరుపాడు, వెంగన్నపాలెం గ్రామాల్లో ద్విచక్ర వాహనాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రధాన రహదారిపై టీడీపీ జెండాలు, తోరణాలను అలంకరించడంతో మండల కేంద్రం పసుపుమయంగా మారిందన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఎంఎల్ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు మాజీ రాష్ట్ర అధ్యక్షులు రోకటి రంగారావు, టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు మనుబోలు కోటంరాజు, మండల కార్యదర్శి చలమల గోవింద్, రోకటి నర్సింహారావు, వెంగన్నపాలెం సర్పంచ్ ఆంగోత్ రామారావు, పొదిల రామారావు, కొండెం వెంకన్న, బెల్లంకొండ రాము, గుత్తా రమేష్, మహంకాళి కృష్ణ, వెల్డింగ్ షాప్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
