కరీంనగర్, ఆంధ్రప్రభ: పెద్దలు ప్రేమపెళ్లికి అంగీకరించరనే భయంతో కరీంనగర్ జిల్లాలో ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. కలిసి జీవించడం సాధ్యం కాదనే ఆలోచనతో జంటగా ఉరేసుకుని చనిపోయారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్యలపల్లికి చెందిన కొండపర్తి అరుణ్ కుమార్ (24) కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి భూపాలపట్నం గ్రామానికి చెందిన అలేఖ్య (21)తో రెండేళ్ల క్రితం పరిచయమైంది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. విద్యాభ్యాసం పూర్తిచేసిన అలేఖ్య కొంతకాలంగా ఇంట్లోనే ఉంటోంది.

అలేఖ్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నతరుణంలో…
అలేఖ్యకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంట్లో తన ప్రేమ వ్యవహారం చెబితే ఎక్కడ ఒప్పుకోరేమోనని గ్రహించిన అరుణ్ కుమార్, అలేఖ్యలు కలిసే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం వారు కరీంనగర్‌లోని తమకు తెలిసిన మిత్రుడి ఇంటికి వెళ్లారు. గురువారం కరీంనగర్ లోని తన మిత్రుడి ఇంట్లోని ఓ గదిలో ప్రేమికులిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అరుణ్, అలేఖ్యల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమికుల ఆత్మహత్యతో చిత్యలపల్లి, భూపాలపట్నం గ్రామాలలో విషాదం నెలకొంది.
మిర్యాలగూడలో ఓ యువకుడు…
మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని యువకుడు రైల్వే స్టేషన్ సమీపంలోని జామాయిల్ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగి బూడిద కలర్ టీ షర్ట్ ధరించి, నల్ల కలరు లోయర్ ధరించి ఉన్నాడు. సమాచారం తెలిసిన వారు రూరల్ ఎస్ ఐ లోకేష్ కుమార్ 8712670189 కు తెలియజేయాలని కోరారు.