POLICE | అరైవ్ – అలైవ్‌ లక్ష్యంతో రోడ్డు భద్రతకు చర్యలు

POLICE | అరైవ్ – అలైవ్‌ లక్ష్యంతో రోడ్డు భద్రతకు చర్యలు

  • రోడ్డు భద్రతపై ప్రభుత్వ శాఖల సమన్వయ అవగాహన
  • ట్రాఫిక్ నియమాల పాటనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట
  • సీపీ అంబర్ కిషోర్ ఝా

POLICE | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘అరైవ్ – అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మార్గదర్శకత్వంలో, డీసీపీ బి. రామ్ రెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం మున్సిపల్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపల్, విద్య, రోడ్డు రవాణా, ఆరోగ్య, ఆర్ అండ్ బి తదితర శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్‌తో పాటు అడిషనల్ కలెక్టర్, పెద్దపల్లి డీసీపీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, ‘అరైవ్ – అలైవ్‌’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడాదిలో 30 శాతం ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. మున్సిపల్, విద్య, ఆరోగ్య, రోడ్డు రవాణా, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు, ఉద్యోగులతో కలిసి సమగ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ముందుగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సేఫ్ అండ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానాలు అనుసరిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సీపీ వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కార్లు మరియు ఇతర ఫోర్ వీలర్ వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అలాగే ప్రతి వాహనదారుడి వద్ద డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలని, ఇవి చట్టపరంగానే కాకుండా ప్రమాద సమయంలో ఆర్థిక భద్రతను కూడా కల్పిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు హెల్మెట్లను పోలీస్ కమిషనర్ పంపిణీ చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ, పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎంఈఓ మల్లేష్, సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. కృపా భాయ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ సాగర్, ఆర్ అండ్ బి శాఖ ఎస్‌ఐ రమేష్, ట్రాఫిక్ ఎస్‌ఐలు హరిశేఖర్, రామరాజు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply