చిన్నారుల ఆరోగ్యం, వార్డ్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి…

చిన్నారుల ఆరోగ్యం, వార్డ్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి…
అంగన్‌వాడీ కేంద్రాలు, నాలా క్లీనింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ పూజిత
మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : ప్రజా పాలన, ప్రగతి పాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 40వ డివిజన్ కార్పొరేటర్ సీ.బీ పూజిత బుధవారం తమ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాల పరిశుభ్రతను పరిశీలించి, చిన్నారులకు శుభ్రమైన,ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు కళారంజని, పద్మ, లలిత, ఆయాలు ప్రమీల, సువర్ణ, కమలాభాయి పాల్గొని కేంద్రం నిర్వహణ, పిల్లలకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. చిన్నారుల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్పొరేటర్ పూజిత తెలిపారు.
అనంతరం వార్డ్‌లోని మున్సిపల్ శానిటేషన్ పరిస్థితులను కూడా పరిశీలించారు. ముఖ్యంగా నాలా క్లీనింగ్ పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి, వార్డ్‌లో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని మున్సిపల్ సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మురుగునీటి పారుదల సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్డ్ అభివృద్ధి, పరిశుభ్రత, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా కార్పొరేటర్ పూజిత పేర్కొన్నారు.
