ఆంధ్రప్రభ, కోడూరు (కృష్ణాజిల్లా) : ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ చొరవతో 50 మంది కృష్ణా జిల్లా వాసులకు తమిళనాడు పోలీసులు రక్షణగా నిలిచారు. కృష్ణా జిల్లాలోని కోడూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 50 మంది మొక్కుబడుల నిమిత్తం తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం లోని వేలంకిణి ప్రాంతానికి వెళ్లారు.
వేలంకిణి మాతను దర్శించుకుని అనంతరం తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. అనంతరం బస్సుల్లోకి ఎక్కి ప్రయాణానికి సిద్ధమైన సమయంలో 50 మంది ప్రయాణికులు తమ లగేజీని బస్సులో సర్దుతున్న తరుణంలో స్థానిక ఆటోవాలాలు బస్సు ను పక్కకు తీయాలని ఆదేశించారు.
ఐదు నిమిషాలు ఆగమని పర్యాటకులు చెప్పగా, పర్యాటకుల మాటలు పట్టించుకోని ఆటోవాలాలు చిన్న పిల్లలు, ఆడోళ్లు అని లేకుండా గొడవ పడ్డారు. ఒకానొక స్థితిలో దాడి చేసేందుకు కర్రలు, రాడ్లు తో సిద్ధమయ్యారు. వెంటనే తిరుపతి శ్రీనివాసరావు ప్రముఖ వాక్యపదేశకులు కొడాలి విజయ్ కుమార్ ద్వారా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్సనల్ అధికారులకు సమాచారం తెలియజేశారు.
వెంటనే స్పందించిన నారా లోకేష్ తమిళనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ఆయన అక్కడి ఐజి కి ఫోన్ చేయగా , ఐజీ నుంచి ఎస్వి కి ఫోన్ వచ్చిందని, నాగపట్నం జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా డిఎస్పీకి సమాచారం ఇవ్వటంతో వెంటనే స్థానిక ఎస్సై సిబ్బందితో ఘటన స్థలికి చేరుకున్నారు. కృష్ణాజిల్లా జిల్లా వాసులకు అండగా నిలిచి రక్షణ కల్పించారు.
కృష్ణా జిల్లా వాసులు ప్రయాణిస్తున్న బస్సు కు దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు రక్షణగా నిలిచారు. సందర్భంగా తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమస్యను కొడాలి విజయ్ కుమార్ ద్వారా వివరించామని, నిమిషాల సమయం లోనే స్పందించి లోకేష్ కృషితో తాము స్వగ్రామాలకు రావటం పట్ల ఆయనకు, తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తిరుపతి శ్రీనివాసరావు, పర్యాటకులు అన్నారు.

