మహిళల ఆరోగ్య చైతన్యమే బలమైన సమాజానికి పునాది

మహిళల ఆరోగ్య చైతన్యమే బలమైన సమాజానికి పునాది
వికాస తరంగిణి ద్వారా 45 లక్షల మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు
1000 సంవత్సరాల క్రితమే కులమతాలకు అతీతంగా అందరికీ ఆలయ ప్రవేశం – రామానుజుల సందేశం
జీయర్ స్వామి ఆశీర్వాదం పొందిన ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు
అచ్చంపేట, ఆంధ్రప్రభ : మహిళల ఆరోగ్యం సమాజానికి మూలం అని, మహిళల ఆరోగ్య చైతన్యమే బలమైన సమాజానికి పునాది అని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అన్నారు. సోమవారం బల్మూరు మండలంలోని కొండనాగుల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలను ఆయన వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ మహిళల సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ కోసం వికాస తరంగిణి సంస్థ గత 15 సంవత్సరాలుగా గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు.
మహిళల ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు, సమాజ అభివృద్ధి పట్ల చైతన్యం కల్పించడం జరుగుతోందన్నారు. భారతదేశంలో మహిళల్లో గర్భకోశ తదితర క్యాన్సర్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు 30 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత తప్పనిసరిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సాధారణంగా రూ.3 వేల ఖర్చు అయ్యే క్యాన్సర్ పరీక్షలను వికాస తరంగిణి ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 45 లక్షల మంది మహిళలకు ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా శిక్షణ కూడా అందిస్తున్నామని చెప్పారు. అలాగే చిన్నారుల్లో దైవభక్తి, ధర్మబోధన పెంపొందించేందుకు ‘ప్రజ్ఞా’ కార్యక్రమం ద్వారా శిక్షణలు ఇస్తున్నామని పేర్కొన్నారు. టీటీడీ ద్వారా వచ్చే నిధులతో ఆలయాల నిర్మాణానికి అదనపు హంగులు చేర్చి పెద్ద హాలుల నిర్మాణానికి అధికారులతో చర్చలు జరిపి సఫలీకృతం అయ్యామని తెలిపారు.
హరిజన, గిరిజన వాడలలో ఆలయాల నిర్మాణానికి ప్రస్తుతం మార్గం సులభమైందని, గ్రామీణ స్థాయిలో ఆలయాల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని కోరారు. కొండనాగుల గ్రామ ప్రజల భక్తి భావం తనను ఎంతో ఆకట్టుకుందని, ధర్మ ప్రచారంలో ఈ గ్రామం ముందంజలో ఉందని కొనియాడారు. వెయ్యి సంవత్సరాల క్రితమే శ్రీ రామానుజులు కులమత భేదాలకు వ్యతిరేకంగా అందరికీ ఆలయ ప్రవేశం కల్పించి సమానత్వాన్ని చాటారని గుర్తు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల పరిరక్షణలో మహిళలు ముందుండాలని, భజన మండళ్లు ఏర్పాటు చేసి ఆలయాల్లో దీపారాధన, భజనలు నిర్వహిస్తూ ధార్మిక చైతన్యాన్ని విస్తరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు కూడా ఇందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఆయన సతీమణి డాక్టర్ అనురాధలను జీయర్ స్వామి ఆశీర్వదించి సత్కరించారు.
చిన్న జీయర్ సేవలు అమోఘం
ఎమ్మెల్యే వంశీకృష్ణ
వెయ్యి సంవత్సరాల కుర్రమే అంతా సమానత్వం అని రామానుజాచార్యులు బోధించి ప్రజలను ఆలయ ప్రవేశం చేయించారని, ఆయన బోధనల వల్ల ప్రజలు సన్మార్గంలో ప్రయాణిస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆయన సతీమణి డాక్టర్ చిక్కుడు అనురాధ ఇరువురు అన్నారు. చిన్న జీయర్ స్వామి రాకతో నల్లమల్ల వాసులలో భక్తి భావాన్ని పెంపొందించిందని నేటి పరిస్థితులలో గ్రామాలలో ఆలయ నిర్మాణాలు నూతనంగా పుట్టుకొస్తున్నాయని, ప్రజలను భక్తి మార్గంలో సమతవాదులుగా మార్చేందుకు చిన్న జీయర్ వారు చేస్తున్న కృషి స్లాగనీయమని అన్నారు.
ప్రపంచానికే దిక్సూచిగా సమతా వాది రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని చిన్న జీయర్ స్వామి ప్రతిష్టించడం జరిగిందని అన్నారు. టీటీడీ వారి విధుల ద్వారా నియోజకవర్గం కేటాయించడం జరిగిందని, మునుముందు వికాస యూత్ తరంగిణి వారి సేవా కార్యక్రమాలలో, ధార్మిక వ్యాప్తిలో తాము కూడా మందుండి సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేందర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, బల్మూరు మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు భారీగా పాల్గొన్నారు.
