గత ప్రభుత్వ పాలనలో అధ్వానంగా రోడ్లు

గత ప్రభుత్వ పాలనలో అధ్వానంగా రోడ్లు

రోడ్ల నిర్మాణంపై గత పాలకుల నిర్లక్ష్యం వల్ల
43 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
శాసనసభలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి

చిలకలూరిపేట, ఆంధ్రప్రభః రాష్ట్రంలో గత ఐదేళ్లలో 1,15,000 రోడ్డు ప్రమాదాలు జరిగి 43 వేల మంది ప్రాణాలు కోల్పోయారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శాసనసభలో గణాంకాలతో సహా వివరించారు. ఆర్ & బీ రోడ్ల దుస్థితిపై జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు.గత పాలకులు రహదారుల అభివృద్ధికి కేవలం రూ.10 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు అమరావతి –అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే, అమరావతి రింగ్ రోడ్ వంటి ప్రధాన ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, దెబ్బతిన్న వేల కిలోమీటర్ల రహదారుల పరిస్థితి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించిందన్నారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే గుంతల రహిత రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టిందని, తాజా బడ్జెట్‌లో రూ.9,900 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ హైవే పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.


భారీ లోడుతో నడిచే వాహనాల వల్ల రోడ్లు త్వరగా దెబ్బతింటున్నాయని, అలాంటి మార్గాలకు ప్రత్యేక డీపీఆర్‌లు రూపొందించి అధిక నాణ్యతతో నిర్మించాలని సూచించారు. నియోజకవర్గ అంశాలు చిలకలూరిపేట–నరసరావుపేట రోడ్డు విస్తరణ చేపట్టాలని, ఎత్తు పెంచాలని కోరారు. జాతీయ రహదారి 167A పనులకు టెండర్లు పిలిచినా ప్రారంభం కాలేదని, భూసేకరణ పరిహారం త్వరగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.


చౌడవరం (జాతీయ రహదారి 16) నుంచి కొండవీడు కోట వరకు రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయాలని సూచించారు. అలాగే ఎన్‌హెచ్–16 బైపాస్‌కు అనుబంధ సర్వీస్ రోడ్లు, అండర్‌పాసులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ రహదారి విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సభ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply