ఒక్క రోజే 4 వేల మందికి..
అచ్చంపేట, ఆంధ్రప్రభ : కార్తీక మాసం ప్రారంభమైన రెండవ రోజుననే ఉమామహేశ్వర క్షేత్రం కార్తిక శోభను సంతరించుకున్నది. అంజనేయ స్వామి నామస్మరణతో ఉమామహేశ్వర క్షేత్రం మార్మోగింది. కార్తీక మాసం ప్రారంభమైన 2వ రోజు గురువారం ఉమామహేశ్వర క్షేత్రం, దిగువ భోగమహేశ్వరంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ ఛైర్మన్ బీరం మాధవ రెడ్డి(Beeram Madhava Reddy), ఆలయ ఈఓ శ్రీనివాస రావు, ప్రధాన అర్చకులు వీరయ్య శాస్త్రి నేతృత్వంలో శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి మాలాధారణను గురుస్వామి జయరాం స్వామి ప్రాతఃకాల పూజతో ప్రారంభించిన అనంతరం స్వాములకు మాలాధరణ కార్యక్రమం భక్తిశ్రద్దల మధ్య ఘణంగా ప్రారంభమైంది.
నల్గొండ, సూర్యాపేట, రంగా రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్, దేవరకొండ, మిర్యాలగూడ(Miryalaguda), మల్లేపల్లి, సాగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆంజనేయ స్వామి మాలధారణ గావించిన అనంతరం కొండపై కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఛైర్మన్ బీరం మాధవ రెడ్డి(Beeram Madhava Reddy) స్వాములకు ప్రత్యేకంగా బిక్షను ఏర్పాటు చేసారు. మాలాధారణ స్వీకరించిన స్వాములతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులకు సైతం త్రాగు నీరు, స్నానాధికాలకు సదుపాయాలు, విద్యుత్తు వంటి అంశాలతో పాటు ఏ చిన్న అసౌఖర్యం, ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు, ఈ ఒక్క రోజే దాదాపు 4 వేల మందికి నిత్యాన్నదానం చేసినట్లు ఆలయ ఛైర్మన్ మాధవ రెడ్డి, ఈఓ శ్రీనివాస రావు(EO Srinivasa Rao) తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు పవన్, ఆలయ అర్చకులు, సిబ్బంది, టూరిస్టు పోలీసులు రాథోడ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
