1st Test | జడ్డూ మ్యాజిక్..

1st Test | జడ్డూ మ్యాజిక్..
- పట్టు బిగించిన టీమిండియా
- కష్టాల్లో సఫారీలు
- రెండో రోజు బౌలర్ల జోరు.. 16 వికెట్లు డౌన్
- భారత్ 189 ఆలౌట్
- దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 93/7
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు(1st Test )లో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లు పర్యాటక జట్టుకు చుక్కలు చూపిస్తే.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు సఫారీ బ్యాటర్లను చుట్టేస్తున్నారు. ఫలితంగా శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా 5 వికెట్లతో ప్రోటీస్ జట్టు పతనాన్ని శాసించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కూడా తడబాటుకు గురై తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌటైంది.
దీంతో గిల్ సేనకు 30 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సఫారీలకు మన స్పిన్నర్లు చుక్కలు చూపించడంతో శనివారం ఆట ముగిసే సమయానికి వారు 93/7 స్కోరు మాత్రమే చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా కేవలం 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఆదివారం టీమిండియా మిగిలిన మూడు వికెట్లు త్వరగానే పడగొట్టితే మూడో రోజే మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లతో మ్యాజిక్ చేయగా.. కుల్దిప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టి టీమిండియాను విజయానికి చేరువచేశారు.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బవుమా (29 బ్యాటింగ్; 78 బంతుల్లో 3 ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మరోవైపు మార్కో జాన్సన్ (13), ర్యాన్ రికెల్టన్ (11), వియాన్ ముల్డర్ (11) మాత్రమే రెండంకెల మార్క్‌ను దటగలిగారు. మిగతా బ్యాటర్లలో ఐడన్ మార్క్రమ్ (4), టోనీ డి జోర్జి (2), ట్రిస్టన్ స్టబ్స్ (5), కైల్ వెరినె (9) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ప్రస్తుతం బవుమాతో పాటు కార్బిన్ బాష్ (1) క్రీజులో ఉన్నాడు.
1st Test | తేలిపోయిన బ్యాటర్లు..
కాగా, అంతకుముందు 37/1 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 62.2 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (39; 119 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇతర బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ (29; 82 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (27; 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (27; 45 బంతుల్లో 3 ఫోర్లు) పర్వాలేదనిపించారు. కానీ, ధ్రువ్ జురెల్ (14), యశస్వి జైస్వాల్ (12), అక్షర్ పటేల్ (16), కుల్దిdప్ యాదవ్ (1), సిరాజ్ (1) ఘోరంగా విఫలమయ్యారు. మరోవైపు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 4 పరుగుల వద్ద గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
1st Test | గిల్‌కు గాయం..

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు ఊహించని భారీ షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. రెండో రోజు బ్యాటింగ్ చేస్తున్న గిల్ మెడపట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. సుందర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్ స్లాగ్ స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించడంతో ఒకేసారి అతడి మెడ పట్టేసింది. దీంతో గిల్ నొప్పితో విలవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి గిల్ మాత్రం ఆసౌకర్యంగానే కన్పించాడు. ఇక నొప్పి తగ్గక పోవడంతో గిల్ ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు తిరిగి బ్యాటింగ్‌కు కూడా రాలేకపోయాడు.
