1MarSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

1MarSunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

1MarSunday2026
1MarSunday2026

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్ర‌భ‌ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

1MarSunday2026 |ఈ సంచికలో…

1. కాటమరాయుడా! కదిరి నరసింహుడా!!
బ్రహ్మోత్సవాలతో భక్తి మయమైన కదిరి (ముఖచిత్ర కథనం)

2. కబుర్లు (శీర్షిక)

3. సన్నిహితం(శీర్షిక)

4. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

5. వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-

కాటమరాయుడా! కదిరి నరసింహుడా!!
బ్రహ్మోత్సవాలతో భక్తి మయమైన కదిరి (ముఖచిత్ర కథనం)

అంకురార్పణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవ వైభవం
కల్యాణోత్సవం, రథోత్సవం ప్రధాన ఆకర్షణలు
ఉగ్రం నుంచి శాంతం వరకు నరసింహుని సందేశం
స్వేదించే స్వామి విశేషం – భక్తిని పెంచే మహిమ
విజయనగర శిల్పకళకు నిదర్శనం కదిరి ఆలయం
ఉత్సవాల సందడి – సంస్కృతి, ఆర్థిక చైతన్యానికి వేదిక
భద్రతా ఏర్పాట్లతో సిద్ధమైన జిల్లా యంత్రాంగం

శ్రీ సత్యసాయి బ్యూరో : రాయలసీమ నేలపై శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తున్న ఆ పవిత్ర నినాదం — “కాటమరాయుడా! కదిరి నరసింహుడా!!”
మరోసారి కదిరి పట్టణాన్ని ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోయింది.
ప్రసిద్ధ కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన వేళ, పట్టణం మొత్తం భక్తి వాతావరణంలో మునిగిపోయింది. గోపురాలపై ప్రతిధ్వనించే ఘంటానాదం, ఆలయ వీధుల్లో వినిపించే నారసిం హుని నామస్మరణం, భక్తుల సందడి — ఇవన్నీ కలిపి కదిరిని ఒక మహా ఆధ్యాత్మిక వేదికగా మార్చాయి.
శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ క్షేత్రం, ఉగ్ర నరసింహుని నుంచి శాంత స్వరూపం వరకు దైవీ భావనను ప్రతిబింబించే అరుదైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలు కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, భక్తి, సంస్కృతి, సంప్రదాయాల కలయికగా భక్తుల హృదయాలలో నిలుస్తాయి.

అంకురార్పణతో ప్రారంభమయ్యే ఆధ్యాత్మిక వేడుకలు

ఫిబ్రవరి 27న అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఆచారం భక్తి విత్తనం మొలకెత్తే క్షణంగా భావిస్తారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు ప్రార్థనలు చేస్తారు. అంకురార్పణ అనంతరం ప్రారంభమయ్యే 15 రోజుల ఉత్సవాల్లో ప్రతిరోజూ జరిగే వాహన సేవలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తుతాయి.

ఫిబ్రవరి 28న జరిగిన కల్యాణోత్సవం ఈ బ్రహ్మోత్సవాల ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్వామి వారి దివ్య కల్యాణాన్ని దర్శించేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం సంగీత నాదాలతో, వేద మంత్రాలతో మార్మోగింది. అనంతరం మార్చి 10న జరిగే బ్రహ్మ రథోత్సవం విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. భారీ రథాన్ని వేలాది మంది భక్తులు కలిసి లాగడం కదిరి ఉత్సవాల ప్రత్యేకత.

ఉగ్రం నుంచి శాంతం వరకు — నరసింహుని దైవ సందేశం.

పురాణాల ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం ఉగ్రంగా నిలిచిన నరసింహుడు, భక్త ప్రహ్లాదుని ప్రార్థనతో శాంత స్వరూపంగా మారిన క్షేత్రంగా కదిరి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో స్వామివారి రూపం భక్తులకు భయం కాదు; రక్షణ, దయ, కరుణకు ప్రతీకగా నిలుస్తుంది.
స్వయంభువుగా ప్రత్యక్షమైన ఈ దేవాలయం, కదిరి వృక్షం మూలాల నుంచి వెలిసిందని స్థానిక విశ్వాసం. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. భక్తులు స్వామివారి దర్శనాన్ని జీవితంలో ఒకసారి అయినా చేయాలని ఆశపడతారు.

స్వేదించే స్వామి — భక్తిని పెంచే విశేషం

కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఉన్న ప్రత్యేకతల్లో ఒకటి స్వామివారి విగ్రహం నుంచి కనిపించే స్వేదం. అభిషేకం అనంతరం నాభి ప్రాంతంలో కనిపించే ఈ స్వేదం భక్తుల్లో అపారమైన భక్తి భావాన్ని కలిగిస్తుంది. శాస్త్రవేత్తలు దీనిపై వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, భక్తుల దృష్టిలో ఇది దైవ కృపకు సంకేతంగా భావించబడుతుంది.
దేశం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు ఈ విశేషాన్ని దర్శించేందుకు ప్రత్యేకంగా కదిరికి చేరుకుంటారు. ఆలయ అర్చకులు కూడా దీన్ని క్షేత్ర మహిమగా వివరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తున్నారు.

శిలల్లో చెక్కబడిన చరిత్ర


కదిరి ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు; చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మాణ శైలులు ఆలయ గోపురాలు, శిల్పాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయానికి ప్రత్యేక అభివృద్ధి జరిగినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. మరాఠా రాజు శివాజీ మహారాజ్ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు స్థానిక కథనాలు చెబుతాయి.

1MarSunday2026
1MarSunday2026


ఆలయంలోని శిల్పాలు పురాణ గాథలను ప్రతిబింబిస్తూ కళా ప్రియులను ఆకర్షిస్తాయి. ప్రతి స్తంభం, ప్రతి శిల్పం ఒక కథ చెబుతున్నట్టుగా ఉంటుంది.
ఉత్సవం అంటే కేవలం పూజలు కాదు — జీవించే సంస్కృతి
బ్రహ్మోత్సవాల సమయంలో కదిరి పట్టణం ఒక జీవించే సంస్కృతిగా మారుతుంది. వాహన సేవల్లో పురాణ కథలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. సంగీత కార్యక్రమాలు, హరినామ సంకీర్తనలు, సాంప్రదాయ నృత్యాలు ఉత్సవాలకు మరింత వైభవం చేకూరుస్తాయి.
స్థానిక వ్యాపారులకు కూడా ఈ ఉత్సవాలు ఆర్థికంగా కీలకం. ఆలయ వీధుల్లో ఏర్పడే తాత్కాలిక దుకాణాలు, ప్రసాదాల విక్రయాలు, పూజా సామగ్రి కొనుగోళ్లు పట్టణానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. భక్తులతో నిండిపోయే వీధులు కదిరి ఆర్థిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాయి.


భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి


ప్రతి ఏడాది వేలాదిమంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, జిల్లా అధికారులు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యాలు, శానిటేషన్ వంటి అంశాలపై ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు చేయడానికి ఆలయ అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేస్తున్నారు.

“రా…” అని పిలిచే కదిరి….

భక్తుల మాటల్లో — “నరసింహుని దర్శనం ఒక్కసారి చేస్తే చాలు… జీవితానికి శాంతి లభిస్తుంది.” ఆ పిలుపే ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. గంటల నాదం మధ్య, వేద మంత్రాల మధ్య, నామస్మరణల మధ్య కదిరి మరోసారి మేల్కొనబోతోంది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా కదిరి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తి ప్రవాహంతో నిండిపోనున్న వేళ, ఆధ్యాత్మిక అనుభూతిని పొందేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. “కాటమరాయుడా! కదిరి నరసింహుడా !!” అనే నినాదం మళ్లీ గగనాన్ని తాకబోతోంది — భక్తి, విశ్వాసం, సంస్కృతిని కలిపే ఆ మహోత్సవానికి కదిరి సిద్ధంగా నిలిచింది.

కే ప్రసాద్,
బ్యూరో ఇంచార్జ్, ఆంధ్రప్రభ, శ్రీ సత్యసాయి జిల్లా

2 కబుర్లు (శీర్షిక)

DEC 2025

అద్దం .. కిటికీ

కిరణ్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అతనికి సోషల్ మీడియాలో వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడూ ఖరీదైన బట్టలు, విలాసవంతమైన హోటళ్లు, కొత్త గ్యాడ్జెట్స్‌తో ఫోటోలు పెడుతూ అందరి దృష్టిలో తానొక ‘సక్సెస్‌ఫుల్ పర్సన్’ అనిపించుకోవడానికి ప్రయత్నిస్తుండేవాడు. కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఏదో తెలియని అశాంతి, ఒత్తిడి. పక్కవాడి లైక్‌ల కోసం, ఇతరుల ప్రశంసల కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ వెళ్లేవాడు.
ఒకరోజు కిరణ్ తన ఊరికి వెళ్ళాడు. అక్కడ తన చిన్ననాటి గురువు గారు రామశాస్త్రి గారిని కలిశాడు. మాటల సందర్భంలో కిరణ్ తన ఫోన్‌లోని ఫోటోలు చూపిస్తూ, “చూడండి సార్, నేను ఎంతలా ఎదిగానో! నా లైఫ్ ఎంత బాగుందో!” అని గొప్పగా చెప్పుకున్నాడు.
శాస్త్రి గారు చిరునవ్వుతో, “కిరణ్, ఒక చిన్న పని చేద్దాం రా” అని ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ గోడకు ఒక పక్కన అద్దం, మరోపక్క కిటికీ ఉన్నాయి.
“కిరణ్, అద్దంలో ఏం కనిపిస్తోంది?” అని అడిగారు.
“నా రూపమే కనిపిస్తోంది సార్,” అన్నాడు కిరణ్.
“సరే, ఇప్పుడు ఆ కిటికీలోంచి చూడు ఏం కనిపిస్తుందో?”
“బయట అందమైన తోట, పక్షులు, కష్టపడి పని చేస్తున్న మనుషులు కనిపిస్తున్నారు సార్,” అన్నాడు.
శాస్త్రి గారు ఇలా వివరించారు:

“నిజమైన వ్యక్తి వికాసం అంటే అద్దం లాంటిది కాదు కిరణ్. అద్దం కేవలం నిన్ను మాత్రమే చూపిస్తుంది, నిన్ను నువ్వు అలంకరించుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ వ్యక్తిత్వం కిటికీలా ఉండాలి. అది లోకాన్ని చూడాలి, ఇతరుల కష్టాన్ని, అవసరాల్ని గుర్తించాలి. అప్పుడే నీకు ‘నేను’ అనే అహంకారం పోయి ‘మనం’ అనే భావన కలుగుతుంది.”

“నువ్వు సోషల్ మీడియాలో చూపించేది కేవలం ‘అద్దం’ లాంటి నీ బయటి మెరుగు మాత్రమే. నీలో ఉన్న సహనం, పట్టుదల, సమాజం పట్ల బాధ్యత పెరిగినప్పుడే నీ ‘వ్యక్తి వికాసం’ పూర్తవుతుంది. ఇతరుల లైక్‌ల కోసం కాదు, నీ మనసు మెచ్చేలా జీవించు,” అని హితవు చెప్పారు.

ప్రదర్శన కంటే ప్రవర్తన ముఖ్యం. పోలిక కంటే పరివర్తన ప్రధానం.


———————————————————————-


3.సన్నిహితం… శీర్షిక

DEC 2025

వృత్తి ధర్మం

వ్యక్తుల పట్ల మన అంచనాలు ఒక్కోసారి తప్పుతూ ఉంటాయి. ఆఫీసులో మనం రోజూ చూసే మన కింద స్థాయి కొలీగ్ మనతో ఎంతో వినయంగా ఉంటాడు. మనం ప్రతీ రోజూ టీ తాగడానికి వెళ్ళే షాప్ వాడు మనతో ఎంతో మర్యాదగా మాట్లాడతాడు. మనకు కూరగాయలు అమ్మడానికి వచ్చే బండి వాడు మనతో ఆప్యాయంగా మాట్లాడి తన కూరగాయలు అమ్ముకుని వెళ్ళిపోతాడు. ఇలా మనకు తెలిసిన వ్యక్తులు మనతో డీసెంట్ గానే వ్యవహరిస్తారు. అయితే ఇదంతా వాళ్ళ నిజమైన వ్యక్తిత్వం ఏనా అన్న సందేహం నాకు కలుగుతూ ఉంటుంది. బహుశా వాళ్ళు అంత ఒద్దికగా మనతో ఉండటానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండటం కారణం అని అనుకునే వాడిని. నాలుగు డబ్బులు సంపాదించి పొట్టపోసుకోవడం కోసం అలా అణిగి మణిగి ఉంటారు అని నిర్ధారించుకున్నాను .
మా ఇంట్లో పని చేసే పని మనిషి కూడా అంతే. ఎంతో ఒద్దికగా ఉంటుంది. డబ్బులు దగ్గర ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. పని బాగా చేస్తుంది. ఎప్పుడూ హెచ్చులకు పోదు. సింపుల్ గా ఉంటుంది. తనకు ఇవ్వాల్సిన డబ్బులు బ్రతిమాలి తీసుకుంటుంది.వీలైనంత వరకు తక్కువ మాట్లాడుతూ ,మా పర్సనల్ విషయాల్లో ఇంటర్ ఫియర్ కాకుండా ఉంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు కదా అలాగే అమాయకంగా ఉంటారు అని అనుకునే వాడిని. ఒకసారి ఆమె పనికి రాలేదు. రెండో రోజు కూడా ఆమె రాకపోయే సరికి ఏమైంది అని తెలుసుకోవడానికి ఆమె ఉంటున్న ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ బస్తీకి వెళ్ళి
ఆమె ఇంటిని చూసాక ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. చిన్న ఇల్లు అయినా చక్కగా ఉంది. ఇంటి బయట రెండు బైక్ లు ఉన్నాయి.ఇంట్లో హాల్లో గోడకు ఎల్.సీ.డీ టీవీ ఉంది.ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. నన్ను చూసి వాళ్ళబ్బాయి ‘ అమ్మకు జ్వరంగా ఉంది సార్..ఇప్పుడు కొంచెం తగ్గింది.రేపు పనికి వస్తుంది ‘ అని చెప్పాడు. ‘ సరే ..జాగ్రత్త ‘ అని చెప్పి వచ్చేసాను. ఇంటిల్లిపాదీ తలా ఒక పని చేసుకుంటూ దర్జా గా బ్రతుకుతున్న మా పనిమనిషి , పనికి వచ్చినపుడు సింపుల్ గా ఉంటుంది. డాబు కొట్టకుండా తన హద్దుల్లో ఉంటుంది.సగటు పేద స్త్రీ లా మాట్లాడుతుంది.పెట్టింది తిని ఇచ్చింది పట్టుకెళుతుంది.ఆమె వృత్తి పనిమనిషి కాబట్టి పనిమనిషిలాగే ప్రవర్తిస్తుంది. బహుశా దీన్నే ‘ వృత్తి ధర్మం ‘ అంటారేమో మిత్రులారా !!!

====================================

4. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

నీతి, ధర్మం!

నీతి, ధర్మం నిత్యం మనం మాటల్లో వాడుతుంటాము! చేతల్లో ఎంతవరకు పాటిస్తామో!! మనుషులను జంతువులను నీతి ధర్మం వేరు చేశాయి!

జంతువులు ఆకలితో ఉన్నపుడు తమ ఆకలి తీర్చుకోవడం మొదటి ప్రధానంగా మారుతుంది! రెండు కుక్కలు మీ తోటలో ఉన్నాయి అనుకోండి!

కుక్కల గురించి ఒక మాట చెప్పాలి….

పెద్ద ఇల్లు, పెరడు ఉన్నప్పుడు మాత్రమే కుక్కలు ఇంట్లో ఉండాలి! చిన్న చిన్న ఇళ్లలో ఈ హైబ్రిడ్ కుక్కలను ఫ్యాషన్ గా స్టైల్ గా ఒక స్టేటస్ సింబల్ గా ఉంచుకోవడం, ఎంగిలి చేత్తో కాకిని తోలని వారు కూడా ఈ కుక్కలను కుక్కమూతి పిందెల్లా ముద్దులు చేస్తూ, స్నానాలు చేయిస్తూ, బారసాలలు, కుక్కలకు పుట్టినరోజులు, కుక్కలకు సమాధులు కడుతూ ఉంటారు. వీరంతా నేరస్థులు, మానసిక రోగులు! ఈ క్రాస్ బీడ్ కుక్కలు (టెడ్డీ బేరుల్లా) అంతా అసహజం! వాటిని అలా పుట్టించడం కూడా ప్రకృతి విరుద్ధం! కానీ ఏం చేస్తాం, నేడు అంతా వ్యాపారం! Business doesn’t have a human face. పెళ్లి, ప్రకృతి కూడా వ్యాపారంలో భాగం అయిపోయాయి! ఆ అసహజ కుక్కలు అయినదానికీ, కానిదానికీ అపార్ట్మెంట్ లలో అస్తమాను భౌ భౌ వావ్ వావ్ … అంటూ మొరుగుతూ పక్క ప్లాట్లులలో ఉన్నా వారికి ఇబ్బంది, విసుగు కలిగిస్తాయి! ఒక నరకం పక్కవారికి! పరీక్షలు రాసే విద్యార్థులు ఏడుస్తూ ఈ disturbance భరిస్తూ చదువుకుంటున్నారు! అడిగితే గొడవలు!

వీళ్లు వీదికుక్కలను పట్టించుకోరు! నిజమైన కాలభైరవుడు మన వీదికుక్కలే! కుక్క మీ పాపాన్ని కొంత తీసుకుంటుంది! కాశీలో కాలభైరవుడు గుడి మీకు తెలుసు!

ఊరులను, గ్రామాలను ఆరోగ్యంగా ఉంచేవి వీథి కుక్కలు! మనుషులు నీచంగా తయారు అయ్యి ఎక్కడ బడితే అక్కడ చెత్త పడేసి పోతే, పాపం ఈ వీధి కుక్కలు అవి తిని, ఊర్లలో బాక్టీరియా పెరగకుండా కాపాడతాయి! నిజానికి కుక్కలు 90% మాంసాహారులు! కార్నివోర్స్!

మాంసం హోటల్స్ అక్కడ కోసి, తినగా మిగిలిన మాంసం చెత్త, సిటీ చివారులలో గ్రామాల రోడ్డులు దగ్గర …చీకట్లో, రాత్రులు ఎవరూ చూడకుండా రహస్యంగా పడేస్తున్నారు! కొందరు ధైర్యంగా అందరి ముందు పడేస్తున్నారు హోటల్స్ మాంసం చెత్త! ఆ మాంసం కుళ్ళి భయంకరమైన సూక్ష్మ జీవులుగా, మనుషులను చంపేసే హానికరమైన బాక్టీరియాగా మారతాయి! భయంకరమైన కంపు ఇంకో ఇబ్బంది! వైరస్ మ్యుటేషన్ కూడా జరిగే ప్రమాదం ఉంది! మీకు ఇంకో కరోనా కావాలా?!

కంపుకి ముక్కు మూసుకుని వెళతారు కానీ సమస్య పరిష్కారం వైపు ఆలోచించే తీరిక ఎందరికో లేదు! ఎన్నుకున్న ఊరు నాయకులు వారి డ్యూటీ వారు చేయరు! ముందు మీకు సేవకులం అంటూ ఓట్లు అడుగుతారు! నెగ్గాకా మన నెత్తి మీద ఎక్కి నాట్యం చేస్తుంటారు! స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పరిస్తితి మారలేదు!

ఆ పడేసిన చికన్, మటన్, గొడ్డు మాంసం ఎలా పోతుంది?! మన దేశంలో అధికారుల పర్యవేక్షణ శూన్యం!

అందరూ ఎవరికి వారే యమునా తీరే! సెటిల్మెంట్లు, డబ్బు దందా, ఎక్కడ సమయం పెడితే లాభమో అక్కడికే వెళతారు! ఊర్లో సర్పంచ్, వార్డు మెంబర్, కార్పొరేటర్ అందరూ రియల్ ఎస్టేట్ దందా, ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టిన డబ్బు వసూళ్లు బిజీలో ఉన్నారు! గ్రామ సేవ, కనీసం గొయ్యి పడిన లేదా రోడ్డు మీద పెద్ద గుంతలు పూడ్చాలి, ఊరులో లైబ్రరీ, పార్కు, మంచినీళ్ళు, గవర్నమెంట్ స్కూల్ లో వసతి…, పిల్లలకు ఆటలు …కనీస సౌకర్యాలు వీటి గురించి ఆలోచించే తీరిక, ఇంగిత జ్ఞానం, సంస్కారం, నీతి, ధర్మం…ఇవి అన్నీ ఉన్న రాజకీయ నాయకులు చాలా తక్కువ!

ఇక వీథి కుక్కలు అలా ఎక్కడ పడితే అక్కడ బాధ్యత రాహిత్యంగా మనుషులు పడేసే మాంసం చెత్త తిని మన గ్రామాలను, నగరాలను కాపాడుతున్నాయి!

కొన్ని సందర్భాల్లో వాటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి! మానవ సమాజం దయతో, క్రమ శిక్షణతో, స్వచ్ఛ భారత్…, ఊరుని నగరాన్ని శుభ్రంగా ఉంచుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా వీథి కుక్కలు తగ్గుతాయి!

మనుషుల జంతుప్రవృత్తి వల్ల, వారు నీతి ధర్మం తప్పడం వల్ల ప్రకృతిలో ఉన్న సకల జీవరాశులు నేడు ఇబ్బంది పడుతున్నాయి!

వీథి కుక్క కూడా ముందు తన ఆకలి తీర్చుకుంటుంది! పక్క కుక్క మీద దెబ్బలాడుతుంది! ప్రతీ కుక్కకి ఒక జ్యూరీ డిక్షన్ ఉంటుంది! ఆ ఏరియాలోకి వేరే కుక్కలను రానివ్వవు! అరచి, ఉరికించి తమ ఏరియాకి వచ్చిన పక్క వీథి కుక్కలను తరుముతాయి! ఇది వాటి జంతు నీతి, వాటి రాజ్యాంగం!

జంతువులు ఒక్కో కింగ్డమ్ లో ఒక్కో రకంగా ఉంటాయి! Animal Kingdom అంతా ఒక ఆశ్చర్యం ! సాటి ప్రాణుల పట్ల దయతో, ప్రేమతో ఉండే జీవరాశి కూడా ఎంతో ఉంది ఈ భూమి మీద!

విజ్ఞత వివేకం తెలిసిన మనిషి మరింత జాగ్రత్తగా, దయతో, ప్రేమతో, క్షమతో ఉండకపోతే మహా పాపం కాదా?! మీరే ఒక్కసారి ఆలోచించండి! నీతి, ధర్మం గురించి!
లోకాసమస్థాసుఖినోభవంతు! ఓం శాంతి!


___________________________________________________________

5.వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

తిరుమలేశుని సన్నిధిలో పరిమళపు అర

తిరుమలేశుని అభిషేక సేవలో వినియోగించే సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేసే చోటును పరిమళపు అర అని పిలుస్తారు. తిరుమల శ్రీవారి సన్నిధికి ఈశాన్యం వైపున, సంపంగి ప్రాకారం లోపల ఉన్న యోగ నరసింహ స్వామి గుడి ప్రాంగణంలో ఈ పరిమళపు అర ఉంటుంది. ఆ గుడికి దక్షిణపు గోడకు వెలుపల వృత్తాకారంలో ఉన్న సాన రాయి ఉన్న చోటినే పరిమళపు అర అంటారు. ప్రతి శుక్రవారం తిరుమలేశుని మూలమూర్తికి నిర్వహించే అభిషేకం కోసం ముందురోజు అర్చక స్వాములు స్వామి కి ధరింప చేసే నామం కోసం 13 తులాల పచ్చకర్పూరాన్ని ఆ రాయి పై నూరి సిద్ధం చేస్తారు.

తరువాత అక్కడే పునుగు, జవ్వాజి, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను కూడా మెత్తగా నూరి సిద్ధం చేస్తారు. శుక్రవారం ఉదయం అభిషేకానికి ముందు ఆలయ జీయ్యర్ స్వామి వెండి గిన్నెలో ఉంచిన పచ్చకర్పూరం ముద్దను తలపై పెట్టుకుని ద్వజస్తంభం, విమాన ప్రాకార ప్రదక్షిణ మార్గంలో ఊరేగింపుగా శ్రీవారి సన్నిధికి తీసుకు వెళ్తారు. ఆపై అభిషేక సేవలో పాల్గొనే భక్తులు ముందుగా సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలు ఉంచిన వెండి గిన్నెలను తలపై పెట్టుకుని జీయ్యర్ స్వామి వెళ్లిన మార్గంలోనే సన్నిధి కి చేరుకుంటారు. ఆ పచ్చకర్పూరం, సుంగంధ ద్రవ్యాల గిన్నెలను స్వీకరించిన అర్చకులు వాటిని స్వామి అభిషేకానికి వినియోగిస్తారు. అంతటి పవిత్ర ద్రవ్యాలను సిద్ధంచేసే సాన రాయి సుగంధ పరిమళ వాసనలతో ఘుమ ఘుమ లాడుతూ ఉంటుంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు పరిమళపు అర లోని రాతిని స్పృశించి, కళ్ళకద్దుకుని ఆధ్యాత్మిక భావనలను పదిలపర్చుకుని వెళ్తుంటారు.

ఓం నమో వేంకటేశాయ

మరిన్ని చక్కటి వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@
gmail.com

click here for more

Leave a Reply