ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు 16 మంది BSF సైనికులకు శౌర్య పతకాలు ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్‌లో, భారత సైన్యం, BSF, ఇతర భద్రతా సిబ్బంది సంయుక్తంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద, సైనిక స్థావరాలపై ఆపరేషన్లు నిర్వహించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా.. ఈ ఆపరేషన్ మే 7 నుంచి 10 వరకు జరిగింది. ఆపరేషన్‌లో రెండు BSF సైనికులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారు.
మరోవైపు, జమ్మూ & కాశ్మీర్ పోలీసులు, CRPF, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సహా ఇతర సిబ్బందికి కూడా శౌర్య పతకాలను ప్రకటించారు. ఈ మెడల్స్ భారత్ సరిహద్దుల తొలి రక్షకుల ధైర్యానికి, నేషనల్ విశ్వాసానికి గుర్తింపు అని BSF అధికారులు తెలిపారు.
శౌర్య పతకాలతో పాటు..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీసు, ఫైర్ సర్వీస్, హోం గార్డ్, సివిల్ డిఫెన్స్ విభాగాల అధికారులకు వివిధ రకాల గ్యాలంట్రీ, సర్వీస్ పతకాలను కేంద్ర హోంశాఖ గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 1,090 మంది ఉన్నారు.
కేంద్ర హోంశాఖ వివరాల ప్రకారం, వీటిలో 233 గ్యాలంట్రీ అవార్డులు, 99 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 758 ప్రశంసనీయ సేవా పతకాలు ఉన్నాయి. విధి నిర్వాహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అందించే గ్యాలంట్రీ పతకాలలో ఎక్కువ భాగం జమ్మూ కశ్మీర్ సిబ్బందికే దక్కాయి.
226 శౌర్య పతకాలు పోలీసులకు
పోలీసు విభాగంలో మొత్తం 226 మంది గ్యాలంట్రీ పతకాలకు, 89 మంది రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు, 635 మంది ప్రశంసనీయ సేవా పతకాలకు ఎంపికయ్యారు. వీరి తరువాత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది ఉన్నారు.
ఫైర్ సర్వీసు, హోం గార్డ్, జైలు విభాగాలకూ పతకాలు
ఫైర్ సర్వీసులో మొత్తం 62 అవార్డులు ప్రకటించారు. ఇందులో 6 గ్యాలంట్రీ, 5 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 51 ప్రశంసనీయ సేవా పతకాలు ఉన్నాయి. హోం గార్డ్, సివిల్ డిఫెన్స్ విభాగాల్లో 1 గ్యాలంట్రీ, 3 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 41 ప్రశంసనీయ సేవా పతకాలు లభించాయి. కరెక్షనల్ సర్వీసెస్ (జైలు శాఖ)లో 2 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 31 ప్రశంసనీయ సేవా పతకాలు ఉన్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవార్డులు
రాష్ట్రాల వారీగా చూస్తే — తెలంగాణకు 1 గ్యాలంట్రీ మెడల్, 2 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 11 ప్రశంసనీయ సేవా పతకాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌కు 2 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 20 ప్రశంసనీయ సేవా పతకాలు దక్కాయి.

