13th to 19th | వినోదం కాదు… మృత్యు బంధనం

13th to 19th | వినోదం కాదు… మృత్యు బంధనం

13th to 19th | లేత మనసులను చిదిమేస్తున్న వీడియో గేమ్స్‌
వీడియో గేమ్స్ కి త్వరగా అడిక్ట్పి అవుతున్న పిల్లలు
టీనేజ్‌ను కబళిస్తున్న కౄరమైన ఆన్‌లైన్ ఆట‌లు
వీడియో గేం స్ తో దెబ్బతింటున్న పిల్లల మానసిక స్థితి
మానవ సంబంధాలకు దూరం..ఒంటరితనానికే పరిమితం.
ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న గేమ్స్‌

13th to 19th | స్మార్ట్‌ఫోన్…సాంకేతిక విప్లవం. ఇందులో అనేక రకాల సేవలు, వినోదాలు, సౌకర్యాలు నిమిషాల వ్యవధిలో పొందే వీలు కల్పిస్తోంది. అంతా బాగానే ఉన్నా.. పిల్లల జీవితాల‌ను మాత్రం స్మార్ట్ ఫోన్ చిదిమేస్తోంది.. స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉండే ఆన్‌లైన్‌ గేమ్స్‌, వీడియో గేమ్స్‌ల‌కు వారు బానిసగా మారుతున్నారు. చదువులు మానేసి వీడియో గేమ్స్ ఆడ‌ట‌మే దినచ‌ర్య‌గా పెట్టుకుంటున్నారు. దీనివ‌ల్ల మానసిక సమస్యలు పెరిగి ఆత్మహత్యలకు పాల్ప‌డుతున్నారు. తీవ్రరూపం దాల్చుతున్న ఈ సమస్యపై ఆంధ్ర ప్రభ వెబ్ స్పెషల్ ఫోకస్ స్టోరీ…

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌ డెస్క్‌, : నేటి సమాజంలో టీనేజ్ పిల్లల జీవితాల్లో అత్యంత ప్రమాదకరంగా మారుతున్న అంశం వీడియో గేమ్స్. చాలా మంది పిల్లలు వీడియో గేమ్స్ కి త్వరగా అడిక్ట్ అవుతున్నారు. ఎంతలా అంటే గేమ్ ఆడనిదే నిద్రపోలేంతగా.. గేమ్ గెలవనిదే అన్నం కూడా తినలేనంతగా వాటికి పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. ఇది వారి మానసిక స్థితి దారుణంగా దెబ్బతీస్తోంది. మానవసంబంధాలకు దూరం చేస్తోంది. ఒకప్పుడు వినోదంగా కనిపించిన ఈ డిజిటల్ ఆటలు.. ఇప్పుడు తల్లిదండ్రుల కళ్లు దాటుకుని, పిల్లల మనసులను కబళిస్తున్న నిశ్శబ్ద రాక్షసాలుగా మారుతున్నాయి. ఇది ఏదో ఒక కుటుంబానికి పరిమితమైన సమస్య మాత్రమే కాదు… సమాజ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోన్న తీవ్ర సవాల్.

13th to 19th
13th to 19th

నిజ జీవితంలో ఓటమి ఎదురైనా, వర్చువల్ ప్రపంచంలో గెలుపు దక్కుతుండటమే పిల్లలను గేమ్స్ వైపు మరింతగా లాగుతోంది. ఇది వినోదం కాదు… ఇది మానసిక బంధనం.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న టాస్క్‌లను ఎందుకు ఫాలో అవుతున్నారో అర్ధం కావ‌డం లేదు. ఇటీవల ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడిన దుర్ఘటన వార్తల్లో చూసినవారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

కొన్ని గేమ్స్, ఆన్‌లైన్ ఛాలెంజ్‌లు పిల్లలను దశలవారీగా భయానికి, ఒత్తిడికి, మానసిక హింసకు గురిచేస్తున్నాయి. ఆన్‌లైన్ గేమ్స్‌లో మొదట చిన్న సవాళ్లు.. తర్వాత ప్రమాదకర ఆదేశాలు.. చివరికి ప్రాణాలను పరీక్షించే టాస్క్‌లు.. ఇలా పిల్లలు గేమ్‌కు బానిసలై పోతున్నారు. ఈ దశలో వాళ్ళను ఆటను ఆపేయించడం పిల్ల‌ల భ‌విష్య‌త్‌కే ప్రమాదం. గేమ్స్‌కు పూర్తిగా అడిక్ట్ కావ‌డం వ‌ల్ల ఇది ఒక కనబడని నరహత్యగా మారుతోంది. ఎందుకిలా అంటే, వీడియో గేమ్స్ మెదడులో డోపమైన్ అనే ఆనంద రసాయనాన్ని విడుదల చేస్తాయి. అదే ఆనందం మళ్లీ మళ్లీ కావాలని మెదడు కోరుతుంది. ఫలితంగా ఫోన్ లేకపోతే వారిలో తీవ్ర చిరాకు.. కోపం, అసహనం.. నిద్రలేమి.. చదువుపై ఆసక్తి కోల్పోవడం.. ఇవన్నీ స్పష్టమైన ప్రమాద హెచ్చరికలు. మద్యం, మత్తు పదార్థాల్లాగే వీడియో గేమ్స్ కూడా పిల్లలను బానిసలుగా మార్చుతున్నాయి.

మరి తల్లిదండ్రులు ఎందుకు గమనించలేకపోతున్నారు?

ఉద్యోగ ఒత్తిళ్లు.. పాప/బాబు ఇంట్లోనే ఉన్నారు కదా అనే తప్పుడు భావ‌న‌.. పిల్లలతో మాట్లాడే టైం, వారితో గడిపే టైం కేటాయించలేకపోవడంతో పిల్ల‌లు ఆన్‌లైన్ గేమ్స్‌కి అల‌వాటు ప‌డుతున్నారు. పిల్లలు గదిలో ఒంటరిగా ఉండటం, మాటలు తగ్గించడం, ఫోన్ దాచిపెట్టడం ఇవన్నీ వీడియో గేమ్స్‌కి బానిస‌లు అయ్యార‌ని హెచ్చరికలుగా గుర్తించ‌వ‌చ్చు. కానీ చాలా కుటుంబాల్లో పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోవ‌డంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో పిల్ల‌ల‌కు వీడియో గేమ్స్ పిచ్చి పీక్స్ చేరుకుంటోంది.

వీడియో గేమ్స్‌ను ప్రభుత్వం నిషేధించలేక పోతుందా?

వీడియో గేమ్స్ విదేశీ సర్వర్ల ద్వారా, కొత్త పేర్లతో, సోషల్ మీడియా మార్గంలో విస్తరిస్తున్నాయి. అయినా ప్రభుత్వం కఠిన సైబర్ చట్టాలు… యాప్ స్టోర్ నియంత్రణ.. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు తీసుకురావాల్సిన బాధ్యత తప్పనిసరి.

బానిసలైన వారిని ఎలా గుర్తుపట్టాలి?

వీడియో గేమ్స్‌కు బానిస‌ల‌య్యార‌ని తెలుసుకోవాలంటే ఈ పిల్లల్లో లక్షణాలను గుర్తించాలి. వెంటనే అప్రమత్తం కావాలి. కుటుంబంతో దూరంగా ఉండటం.. ఫోన్ లేకపోతే ఆగ్రహం.. చదువు, ఆటలపై ఆసక్తి తగ్గడం.. నిద్ర, ఆహార అలవాట్లలో మార్పులు.. క‌నిపిస్తే అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

ఈ ఊబిలోంచి పిల్లలను ఎలా బయటికి తేవాలి?

బెదిరింపులు కాదు… బలవంతం కాదు ప్రేమ‌, స‌హ‌నం, సంభాషణ అవ‌స‌రం. పిల్లలతో ఓర్పుగా మాట్లాడాలి. “నువ్వు ఒంటరిగా లేవు” అనే ధైర్యం, భరోసా వారికి ఇవ్వాలి. అవసరమైతే కౌన్సిలర్ సహాయం తీసుకోవడంలో కూడా ఎలాంటి సంకోచం అవసరం లేదు.

ప్రభుత్వాలకు వీటిపై నియంత్రణ ఉండదా?

పిల్ల‌లు వీడియో గేమ్స్‌కు బానిస కాకుండా చూడాలంటే వారి తల్లిదండ్రులే కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వారు రోజులో ఎంతసేపు మొబైల్స్ చూస్తున్నారో గమనించాలి. కుటుంబ నియమాలు. పాఠశాల–తల్లిదండ్రుల మధ్య సమన్వయం త‌ప్ప‌నిస‌రి.

Leave a Reply