13 wards | స్టేషన్ ఘన్‌పూర్‌లో ఘన విజయం!

13 wards | స్టేషన్ ఘన్‌పూర్‌లో ఘన విజయం!
- 18వార్డుల్లో కాంగ్రెస్ ఖాతాలోకి 13 వార్డులు..
- చైర్మన్ పీఠంపై ముందంజలో తాటికొండ వినయ్ (సన్నీ) పేరు..
- ఎస్సీ రిజర్వ్ చైర్మన్ సీటు…కాంగ్రెస్‌లో చర్చలు జోరు
- వైస్ చైర్మన్ పదవికి ముగ్గురి మధ్య పోటీ?
- నీల రాజమ్మ, గట్టు సంగీత, సంపత్ రాజు పేర్లు వినిపిస్తున్నాయి
- ఫిబ్రవరి 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
13 wards | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజ నం సృష్టించింది. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థు లు స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించి పట్టణ ఓటర్లు కాంగ్రెస్‌కే పట్టం కట్టారని నిరూపించారు. మొత్తం 18 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 13వార్డుల్లో ఘనవిజయం సాధించి మున్సిపాలిటీలో జెండా ఎగరేసింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కేవలం 5 వార్డులకు మాత్రమే పరిమితమైంది. ఈ ఫలితాలతో స్టేషన్ ఘన్పూర్ పట్టణ ఓట ర్లు కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ఇచ్చారని స్పష్టమైంది. అభివృద్ధి, సంక్షేమ హామీలపై విశ్వాసంతో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు రాజ కీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
చైర్మన్ పీఠంపై తాటికొండ వినయ్ (సన్నీ) పేరు హాట్ టాపిక్!
మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 16 (సోమవారం)న కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసి, అదే రోజు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎస్సీ రిజర్వ్ చేసిన చైర్మన్ పీఠం 13వ వార్డు నుంచి గెలుపొందిన తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ)కి వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని తెలుస్తుంది. మొత్తంగా 13 వార్డుల్లో గెలిచిన బలంతో కాంగ్రెస్ నిర్ణయం ఏకగ్రీవంగా ఉండే అవకాశం ఉంది.
వైస్ చైర్మన్ పదవికి ముగ్గురి మధ్య పోటీ:

మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి 11వ వార్డు నుంచి గెలుపొందిన నీల రాజమ్మ, 12 వ వార్డు నుంచి గెలుపొందిన గట్టు సంగీత, 9వ వార్డు నుంచి సౌదరపల్లి సంపత్ రాజు పోటీ పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో మున్సిపల్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
కౌంటింగ్ కేంద్రం బయట సంబరాల జోష్:

ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక కౌంటింగ్ కేంద్రం బయట కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుని, శాలువాలతో అభినందనలు తెలుపుతూ నాయకులను భుజాలపై ఎక్కించుకుని విజయోత్సవాలు జరిపారు. కొంతసేపు పట్టణం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన వార్డుల్లో కూడా కార్యకర్తలు సంబరాలు జరిపారు. అయితే మొత్తం మీద కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది.
కొత్త రాజకీయ సమీకరణాల దిశగా స్టేషన్ ఘన్పూర్:

ఈ ఫలితాలతో స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలమైన ఆధిపత్యాన్ని సాధించింది. చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొనగా, స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, సంక్షేమ కార్యక్రమాల అమలుపై కొత్త బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. మొత్తం మీద స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగురేసింది అనేది స్పష్టంగా వినిపిస్తోంది.
click here to read more : బాల్య వివాహలు నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత..
