Cyber gang | సైబర్ గ్యాంగ్ ముఠా 13 మంది అరెస్ట్..

Cyber gang | సైబర్ గ్యాంగ్ ముఠా 13 మంది అరెస్ట్..
- డిజిటల్ అరెస్టులు పేరుతో మోసాలు..
- చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదు..
- ఎస్పీ అద్నాన్ నయీం అస్మి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ సైబర్ నేరాలకు పాల్పడే డిజిటల్ అరెస్టు ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా అరెస్టు సంబంధించిన వివరాలను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి భీమవరం గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
భీమవరానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ శర్మ నుంచి సైబర్ నేరగాళ్లు ఇటీవల పలుమార్లు రూ.78 లక్షలు దోచుకున్నారు. దీనిపై బాధితుడు శర్మ ఈనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీసులు వేగవంతమైన ప్రణాళికతో నిందితులను పట్టుకున్నారు.
పది రోజులుగా ఏడు బృందాలుగా విడిపోయి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ కేసుతో సంబంధం ఉన్న 14 మందిని గుర్తించగా 13 మందిని గన్నవరం, విజయవాడ సమీపంలో అరెస్టు చేసినట్లు గురువారం ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి వెల్లడించారు.
నిందితుల నుంచి రూ.42 లక్షలు రికవరీ చేయడంతో పాటు వివిధ బ్యాంకుల్లో రూ.19లక్షల నగదును ఫ్రీజ్ చేశామని, అంతర్జాయ సిమ్ కార్డులతో కూడిన 15 చరవాణి లను, డిజిటల్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రదారి రహతే జె నయన్ పరారీ ఉన్నాడు.
ఈ ముఠా సభ్యులు కార్డ్ డీల్ అనే నూతన పద్ధతిలో భారతీయుల బ్యాంకు ఖాతాలను సేకరించి కాంబోడియాకు పంపుతున్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. అక్కడి నుంచి డిజిటల్ అరెస్టుల పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారన్నారు.
నిందితుల్లో ఏడుగురు గతంలో కాంబోడియాలో కలిసి పనిచేశారని, ఇక్కడ మరికొంతమందితో దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. గతంలో వారిపై కేసులేమైనా ఉన్నాయా అనే అంశాలను విచారణ చేస్తున్నామన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో అని ఎక్కడా లేదని ఇది సైబర్ నేరగాళ్లు ఉపయోగించే ఓ ఆయుధమని అన్నారు.
ప్రతి ఒక్కరు తమ బ్యాంకు వివరాలు పిన్ లేదా ఓటీపీ వివరాలను ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో వెల్లడించవద్దని సూచించారు. ఇటువంటి అనుమానాస్పద ఫోన్ కాల్స్ పై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 19 30 కి కాల్ చేసి తెలియజేయాలని కోరారు.
ఈ కేసును ఛేదించిన సీఐలు కాళీచరణ్, ఎం. నాగరాజు, వి.జగదీశ్వరరావు, ఎస్సైలు మంతెన రవి వర్మ, రెహమాన్, హెచ్.నాగరాజు, ఎన్. శ్రీనివాసరావు, కె.ఎం.వంశీలను ప్రత్యేకంగా అభినందించారు. వీరికి నగదు రివార్డులను ఎస్పీ అందించారు.
Cyber gang సైబర్ ముద్దాయిలు వీరే..
రహతే జె నయన్ (ముంబయి), పుట్టగుంపుల శ్రీనివాస చౌదరి (బెంగళూరు), హైదరాబాద్ కు చెందిన గద్రతి చిన్ని బ్లాండినా, గద్రతి శ్రీకాంత్, పిల్లి వంశీ ప్రసాద్, తమ్మినేని సునీల్ కుమార్, విశాఖపట్నానికి చెందిన మామిడి వెంకట్ రోహిణీకుమార్, కూరగాయల ఈశ్వర్, కొమ్మినేని అజయ్ (ఖమ్మం), అనంతపురానికి చెందిన తల్లారి జయచంద్రకుమార్, మంక ముక్కవేమనారాయణ (బాబు), ములకల రాజేష్, సత్యసాయి జిల్లాకు చెందిన పెద్దన్న మంజునాథ్ రెడ్డి, పంకల హనుమంత్ రెడ్డి లు ఉన్నారు.
