12aprileditorial | ప్రపంచ దేశాల ప్రేక్షక పాత్ర – అమెరికా–ఇరాన్ యుద్ధంపై మౌనంలో ప్రపంచం

12aprileditorial | ప్రపంచ దేశాల ప్రేక్షక పాత్ర – అమెరికా–ఇరాన్ యుద్ధంపై మౌనంలో ప్రపంచం
12aprileditorial అమెరికా–ఇరాన్ యుద్ధం: ప్రాంతీయ సమస్యా? ప్రపంచ సంక్షోభమా?
ప్రపంచ దేశాల మౌనం – నాయకత్వ లోపమా?
అంతర్జాతీయ సంస్థలు ఎందుకు విఫలమవుతున్నాయి?
డొనాల్డ్ ట్రంప్ వైఖరి – దౌత్యానికి విరుద్ధమా?
చైనా, రష్యా, భారత్ నేతల దౌత్య ధోరణి
ప్రపంచ భద్రతపై యుద్ధ ప్రభావం
శాంతి కోసం కొత్త అంతర్జాతీయ అజెండా అవసరం
12aprileditorial |భూగోళం వణుకుతోంది! అభద్రతతో అవాక్కవుతోంది!! 197 మిలియన్ చదరపు మైళ్ల విస్తీర్ణం..8.3 బిలియన్ల మంది ప్రజలు..195 గుర్తింపు పొందిన దేశాలు..ఇందులో ఐరాస సభ్యత్వం ఉన్నవి 193..ఇవి కాక ఇంకా చిన్నాచితకా దేశాలు..ఖండఖండాలుగా ఉన్న ప్రపంచం..ఎక్కడి సంస్కృతుల్ని అక్కడే పదిలంగా కాపాడుకుంటున్న దేశాలు..ఎవరికి వారు ప్రశాంతంగా ఉండాలని తపించే దేశాలు..ఇంతటి సువిశాల విశ్వం ఇప్పుడు బేలగా చూస్తున్నది! సమస్య అమెరికా-ఇరాన్ యుద్ధం కాదు…దరిమిలా తలెత్తిన కష్టనష్టాలూ కాదు. అలాగని అవేవీ లేవని కాదు. యుద్ధంతో సంచిత పాపంలా అవి సంక్రమిస్తాయి. కాని సమస్యల్లా యుద్ధం అనివార్యతే! ఒక ఇరాన్‌ని తుత్తునియలు చేస్తే ప్రపంచం శాంతిమయం అవుతుందనా ఈ యుద్ధం? ఇరాన్ యావత్ ప్రపంచానికి ఒక ముప్పులా పరిణమించిందనా ఈ యుద్ధం? ఈ ప్రశ్నల్నే నెమరువేసుకుంటూ ప్రపంచం నిస్సహాయంగా నిర్లిప్తంగా మిగిలిపోయింది.

యుద్ధం మొదలై దాదాపు నెలన్నర కావస్తున్నది. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..ఇటు ఇరాన్ నాయకులు..మధ్యలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..వీరి గొంతులు తప్ప మరేవీ వినిపించడం లేదు. నిజానికి యుద్ధం మూడు దేశాల మధ్యే అయినా అది పశ్చిమాసియా మొత్తాన్ని కుదిపేసింది. మధ్య ప్రాచ్యం అగ్నిగోళమే అయింది. గల్ఫ్ దేశాలను అట్టుడికించింది. దాని ప్రభావం యావత్ ప్రపంచం మీద పడుతున్నది. ప్రపంచాన్నే ఇంతగా అతలాకుతలం చేస్తున్న ఈ యుద్దం ఆ ముగ్గురికి మాత్రమే సంబంధించింది అన్నట్టు ప్రపంచ దేశాలు మౌనం పాటించడం విచిత్రంగా తోస్తున్నది. అంతకన్నా విషాదం ఏమిటంటే..ఈ సంక్షోభంలో తమకి తాము రోజువారీ గట్టెక్కేదెలా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడటమే.
ఇక్కడే ప్రపంచ నాయకత్వంలోని డొల్లతనం బయటపడుతున్నది. దశాబ్దాలుగా వివిధ దేశాలు ఎక్కడికక్కడ రకరకాల గ్రూపులుగా ఏర్పడి ఆర్ధిక, వాణిజ్య అవసరాలను పెంపొందించుకుంటున్న చరిత్ర తెలిసిందే. జి-4, జి-5, జి-7, జి-8, జి-20, సార్క్, నామ్, నాటో, బ్రిక్స్, ఒపెక్, ఐసిఏ, ఎస్సిఓ, బిమ్స్టెక్, ఏసియన్..ఇలా ఎన్నెన్ని గ్రూపులు..సంఖ్య పెరుగుతున్న కొద్దీ పేర్లు మార్చుకున్న గ్రూపులూ ఇందులో ఉన్నాయి. ఇక ఐక్యరాజ్య సమితి ఉండనే ఉంది. అస్ధిత్వంలో ఉన్నా లేనట్టున్న అలీన దేశాల గ్రూపు.. మరి ఇవన్నీ ఏమి చేస్తున్నట్టు? ప్రపంచ దేశాలే కదా ఈ గ్రూపుల్లో, ఈ సమితిలో ఉన్నది? వీటికి బరువు బాధ్యతల్లేవా అన్నది ఒక అంశమైతే ఇవేవీ బాధిత దేశాలు కాదా? ఇందులో ఏ ఒక్క గ్రూపూ పెద్దరికం పాత్ర పోషించే పరిస్థితి లేదని తేటతెల్లమవుతున్నందు వల్లే కదా యావత్ ప్రపంచం నైరాశ్యంలో మునిగితేలుతున్నది. ఇరాన్‌తో ఒక అమెరికాకి, లెబనాన్, ఇరాన్‌లతో ఒక ఇజ్రాయెల్‌కి సమస్యలు ఉన్నప్పుడు ఐరాసలో మాట్లాడి పరిష్కరించే విధానమే లేకుండా పోవడం కన్నా విషాదం ఏముంది?
ఐక్యరాజ్యసమితిని ఇందుకనుగుణంగా సంస్కరించుకోవాలన్న చొరవే మృగ్యం కావడానికి కారకులెవ్వరు? ఈ ప్రశ్నలు లేవనెత్తే వారే లేరు. లేవనెత్తినా సమాధానం చెప్పాల్సిన బాధ్యులు అందుకు అంగీకరించరు. ఇంతటి వైరుధ్య పరిస్థితుల్లో ప్రపంచమే ఏకాకిగా మారి ఒక భయానక సంక్షోభాన్ని మనముందుంచింది. యుద్ధానికి సహేతుక, నిర్హేతుక కారణాలంటూ ఉండవు. యుద్ధమే నిర్హేతుకమైనప్పుడు కారణాలను విశ్లేషించుకోవడం అవివేకమే అవుతుంది. ఒక ఆంగ్ల సామెత ప్రకారం దేశ ప్రపంచ ప్రయోజనాల కోసం యుద్ధాలు జరగవు. కేవలం వ్యక్తిగత అభిజాత్యాలే యుద్ధోన్మాదానికి కారణం. అది ప్రస్తుత అమెరికా-ఇరాన్ యుద్దంలో ప్రతిబింబిస్తున్నది.
ఈ యుద్ధానికి మూల కారకుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని అందరూ అనుకుంటున్నదే. ఇది ఎంత స్ధాయిలో చర్చనీయాంశమైందో ఆయన వాచాలత్వం అంతకన్నా ఎక్కువ స్దాయిలో పరిహాసాస్పదమైంది. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యంగా చెలామణి కావాలన్న తన దుగ్దని అమెరికా అవకాశం వచ్చినప్పుడల్లా చాటుకుంటున్న విషయం పాతదే. ట్రంప్ వ్యవహార శైలి అడుగడుగునా దీన్నే ప్రతిబింబిస్తున్నది. ఒక అగ్రరాజ్యాధినేత..యుద్ధానికి రోడ్‌మ్యాప్ గీసి తానే యుద్ధాన్ని స్టీరింగ్ చేస్తున్న నాయకుడు.. ఇంతటి సంక్షోభ సమయంలో పాటించాల్సిన నిగ్రహం కాని వివేచన గాని పాటించకుండా గంటకో మాట..రోజుకో విధానంగా ప్రవర్తించడం ద్వారా ప్రపంచ భద్రత క్షణభంగురమే అన్న భావన కలగజేస్తున్నారు. యుద్ధం మొదలు కాకముందు నుంచే ఆయన చేసిన ప్రకటనలు వ్యక్తిగత కక్ష కార్పణ్యాల కారకాలుగా ధ్వనించాయి. ఇక యుద్ధం మొదలయ్యాక ప్రపంచ దేశాల బాధలు గాధలు ఏమీ పట్టకుండా తన పంతమే నెగ్గాలన్న రీతిలో యుద్ధ గమనాన్ని మారుస్తున్న తీరు పాలకుడిగా ట్రంప్ బాధ్యతారాహిత్యాన్ని బట్టబయలు చేస్తున్నది.
ఒక అధ్యయనం ప్రకారం ప్రజాపాలకులకు కొన్ని లక్ష్మణరేఖలున్నాయి. ముఖ్యంగా ప్రపంచం మీద ప్రభావం చూపగల అంతర్జాతీయ నేతలు తమ చర్యల ద్వారానే మాటాడాలి కాని నోరు పారేసుకోకూడదని ఒక అంతర్జాతీయ అధ్యయనం చెబుతున్నది. మితిమీరిన వాచాలత్వం ఆయా నేతల ఆధిపత్య ధోరణికి నిదర్శనం. అంతేకాదు.
అభద్రతా భావం, అపార్ధాలతో నేతలు అతిగా మాట్లాడతారని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఎప్పటికప్పుడు సమంజసమైన, సహేతుకమైన సమాచారం చేతిలో ఉన్నప్పుడు నేతల మాట తీరు సవ్యంగా ఉంటుందని, అది కొరవడినప్పుడు అదుపు తప్పి మాట్లాడతారని కూడా తేలింది. వీటినన్నింటినీ ట్రంప్‌కి అన్వయించి పరిశీలిస్తే వాస్తవాలేనని ధృవపడుతుంది. ఆత్మ విశ్వాసం కొరవడి, తన తోటి సిబ్బందినే నమ్మలేని స్ధితిలో అలాంటి నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్న వాస్తవం ట్రంప్ విషయంలో నిరూపితమవుతున్నది. వివేకవంతమైన నాయకుడు ఎదుటివారు చెప్పేది వినడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారని, ట్రంప్‌లో ఆ సంయమనం లేదని, నోటి మాట ద్వారా ఆర్డర్లు వేయడం ఆయనకు సరదా అని ఆయన అనుయాయులే చెప్పిన విషయాన్ని మర్చిపోకూడదు. ఇదే సమయంలో అంతర్జాతీయ విశ్లేషకులు ఇతర నాయకులతో ట్రంప్ వ్యవహార శైలిని బేరీజు వేసి ట్రంప్‌లోని డొల్లతనాన్ని బైటపెడుతున్నారు.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ని ఒక ఉదాహరణగా చెబుతున్నారు. దేశీయంగా ఆయన నిర్ణయాలు ఎలాగైనా ఉండొచ్చు. కాని మితభాషిగా ఆయనకు పేరు. తన మనస్సులో ఏముందో తెలుసుకోవడం అంత తేలిక కాదు. అంతర్జాతీయ అంశాల మీద మాట్లాడే విషయంలో ఆచితూచి మాట్లాడే తీరు దౌత్య సంప్రదాయాలకు అద్దం పడుతుందని విశ్లేషకులు నిర్ధారిస్తున్నారు. చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పడం..అత్యంత క్లుప్తీకరణ జిన్‌పింగ్ ప్రకటనల ప్రధాన లక్షణంగా కనిపిస్తాయి. నిజానికి అమెరికాలో ట్రంప్‌కి ఉన్న పలుకుబడి కన్నా చైనాలో జిన్‌పింగ్‌కి ఉన్న పరపతి చాలా ఎక్కువ. అది నియంతృత్వమా..ఇంకేమన్నానా అన్నది పక్క పెడితే అంతటి తిరుగులేని నాయకుడు ఎంతటి నిబ్బరంగా నిగ్రహంగా ఉంటారన్నదే ఇక్కడి అంశం.
అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్. నిజానికి జిన్‌పింగ్ అయినా పుతిన్ అయినా అగ్రరాజ్యాధినేత స్ధానానికి పోటీపడుతున్న వారే. కాని అదెప్పుడూ వారి మాటల్లో వ్యక్తం కాదు. దేశాధినేతలుగా మరొక దేశాన్ని విమర్శించాల్సి వచ్చినప్పుడు వారు వాడే దౌత్యభాషే వారి స్దాయిని సూచిస్తుంది. అమెరికాతో పోటీ పడుతూ దాదాపు శత్రుదేశంగా భావిస్తున్నా జిన్‌పింగ్ అమెరికా గురించి కాని, ట్రంప్ గురించి కాని హద్దులు మీరి మాట్లాడిన సందర్భాలు కనిపించవు. కాని ఆంతరంగికంగా వాణిజ్య, ఆర్ధిక వ్యవహారాల్లో తిరుగులేని పోటీదారుగా ఏమాత్రం కొరుకుడు పడని నేతగా వ్యవహరిస్తారు. అలాగే బ్రిటన్ ప్రధాని, ఇతర ఐరోపా దేశాధినేతలు సైతం దౌత్య పరిభాషలోనే వారి మనోభావాలు వ్యక్తపరుస్తారు. వారి విధానాల్లో ఊగిసలాట
ఉండదు. చంచల స్వభావం ఉండదు. ఒక అవగాహనకు వచ్చే ముందే అన్ని కోణాల్లో చర్చించి, మేధోమథనం జరిపి ఒక నిర్ణయానికి వస్తారు. అదే ప్రకటిస్తారు. దాన్నే అనుసరిస్తారు. మరి ట్రంప్‌లో ఈ వైఖరిని కల్లోనైనా ఊహించగలరా? ఆమాటకొస్తే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఏనాడూ తన దౌత్య మర్యాదలను అతిక్రమించలేదు. పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు విసిగి వేసారిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ ద్వారా దాని పెడరెక్కలు విరిచిన సందర్భంలోనూ ప్రధాని మోడీ అంతర్జాతీయ నాయకునిగా తిరుగులేని పరిణతితో వ్యవహరించారే గాని పాకిస్తాన్ మీద స్ధాయిని మరిచి వ్యక్తిగత కక్ష కార్పణ్యాల ప్రకటనలు ఇవ్వలేదు.
పాకిస్తాన్ మీద భారత్ దాడులు రసకందాయంలో ఉన్న సమయంలో రోజువారీ అత్యున్నత సమీక్షల్లో నిర్ణయాలు చేస్తూ అమలు చేసిన రోజుల్లోనూ ప్రధాని మోడీ దగ్గర నుంచి కీలక నేతలు, సైనికాధికారులు సైతం అత్యంత నిగ్రహంతో వ్యవహరించారు. ఇది ఒక యుద్ధరీతి. యుద్ధనీతి. అవతల పాకిస్తాన్ మాత్రం ఎలాంటి ప్రేలాపనలు చేసిందో మనకు తెలుసు. ప్రధాని మోడీ వ్యవహరించిన తీరుతో ట్రంప్ నడతను పోల్చగలమా? అంతర్జాతీయంగా పాకిస్తాన్నే వివిధ దేశాలు తప్పు పట్టాయి. మరి ఇక్కడ ట్రంప్ పరిస్థితి పూర్తిగా భిన్నం. ప్రపంచ దేశాల వేళ్లు ట్రంప్‌నే చూపిస్తున్నాయి.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్ ప్రధానమంత్రి మోడీ భారతదేశపు పరిమితులకు లోబడి నిగ్రహపూరిత దౌత్య విధానంలో దేశీయంగా చమురు, గ్యాస్ సరఫరాల కోసం తీసుకున్న చర్యలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి. భారతదేశ విదేశీ విధానం పరిధిలో ఇజ్రాయెల్ మిత్రదేశమే. ఇరాన్ సంగతి చెప్పేదే లేదు. అది శతాబ్దాల అనుబంధం. ఇక అమెరికాతో వాణిజ్యపరమైన ప్రగాఢ మైత్రి. యుద్ధక్షేత్రంలో ఉన్న మూడు పక్షాలు భారత్‌కు మిత్రదేశాలైనప్పుడు ప్రధాని మోడీ విదేశాంగ నీతి ముగ్గురితో సమదూరం, సమన్యాయం సూత్రంతో సత్ఫలితాలు సాధిస్తున్నది. ఇదే తరుణంలో ప్రధాని మోడీ అంతర్జాతీయంగా వివిధ సంక్షోభాల సమయంలో చేసిన ప్రకటనలు ఆయా దేశాల మనసుని చూరగొన్నాయే గాని కొత్త సమస్యలు సృష్టించలేదు.
ప్రధాని మోడీ స్వదేశంలో ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రసంగాలు భిన్నంగా ఉండొచ్చు గాని అంతర్ధాతీయ స్ధాయిలో సంఘర్షణల సమయాల్లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఒక విశ్వ నాయకుడి స్ధాయిని ప్రదర్శిస్తున్నారు. ఆయన చేసే ప్రకటనల్లో భావోద్వేగం ఉంటుంది తప్ప వివాదాలు రెచ్చగొట్టే పరుష పదాలు ఉండవు. శాంతి వచనాలే ఉంటాయి తప్ప ఒకవైపు మొగ్గుతున్న భావన ఉండదు. భారతదేశపు శాంతి సూత్రాన్ని ఆయన పదేపదే నొక్కి వక్కాణిస్తారు. అందుకే భారత్ వైపు అనేక దేశాలు చూస్తుంటాయి. ఇంతమంది పరిణతి చెందిన అంతర్జాతీయ నేతల మధ్య అగ్రరాజ్యాధినేత తన వాచాలత్వంతో తేలిపోతున్నారు.
ఇరాన్ నాగరికతనే తుడిచిపెట్టేస్తానని ఆయన చేసిన ప్రకటన ఒక్క ట్రంప్‌కే నష్టం చేయలేదు. ట్రంప్‌ని తమ నాయకుడిగాఎన్నుకున్న అమెరికన్లను కూడా పలుచన చేసింది. తానే రెండు వారాల కాల్పుల విరమణకు ప్రతిపాదించిన తర్వాత ఆయన ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలి? ఎంత ఆచితూచి మాట్లాడాలి? చర్చలు విఫలమైతే దాడులు తప్పవని అంతలోనే నోరు జారితే ఆ చర్చల పర్యవసానం ఎలా ఉంటుంది? అది క్షణికావేశం..తెంపరితనం..అభిజాత్యం కలగలిసిన వింత మనస్తత్వం.
అందుకే ప్రపంచం మూల్యం చెల్లించుకుంటున్నది. ఇలాంటి నేతలకు దౌత్య మార్గాల మీద నమ్మకం ఉండదు. నేను శాసిస్తా..మీరు శిరస్సు వంచాలి అన్నదే వీరి విధానంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే ప్రపంచం ఒంటరిదైపోయింది. ట్రంప్నైనా మెడలు వంచి దారికి తేగల విశ్వ నాయకుడి కోసం ప్రపంచం దీనంగా ఎదురు చూస్తున్నది. నిజానికి ఇది మూడు దేశాల మధ్య యుద్ధం కాదు. నిర్వచనాల చట్రంలో ఇది ప్రపంచ యుద్ధం కాకపోవచ్చు గాని అంతకన్నా పెద్దదే. దీని పర్యవసానాలు ప్రపంచ యుద్ధాల తదనంతర పరిణామాలతో సమంగానే ఉంటాయి. అందుకే ఇలాంటి విపత్కర
పరిస్థితులను నివారించగల సరికొత్త అజెండా కావాలి. ట్రంప్ చర్యల్ని అమెరికన్లు రోడ్ల మీదికి వచ్చి నిరసించారు గాని ప్రపంచ దేశాలు మాత్రం ఆ పని చేయలేకపోతున్నాయి. ఇది మరింత విషాదం!
-వయ్యస్సారెస్
