కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ‘హస్తం’ ప్రచార హోరు!

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలుపెరగకుండా గడప గడపకూ వెళ్లి ఓటర్లను కలుస్తూ ‘హస్తం’ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గారు 9వ వార్డు అభ్యర్థి శారద, 10వ వార్డు అభ్యర్థి డీకొండ పద్మ, 11వ వార్డు అభ్యర్థి గాలి సుమలత, 12వ వార్డు అభ్యర్థి జరుపుల లక్ష్మి, 23వ వార్డు అభ్యర్థి జంగం కల్పన, 24వ వార్డు అభ్యర్థి దామెర విజయలత , 25వ వార్డు అభ్యర్థి కంకటి ప్రణీతల తరఫున ముమ్మరంగా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బెల్లంపల్లి పట్టణ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పట్టణం వెనుకబడిందని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ప్రచారంలో ఎమ్మెల్యే గారి వినూత్న శైలి అందరినీ ఆకర్షించింది. ప్రచార ఊరేగింపులో భాగంగా తప్పెట (డప్పు) వాయిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే బెల్లంపల్లి పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, జక్కుల శ్రీధర్, నెల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply