103 complaints | విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం…

103 complaints | విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం…
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 103 ఫిర్యాదులు
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
103 complaints | కర్నూలు, ఆంధ్రప్రభ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. కర్నూలు కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
103 complaints | మొత్తం 103 ఫిర్యాదులు
ఈ కార్యక్రమానికి మొత్తం 103 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుల్లో నంద్యాల జిల్లా పాములపాడు మండలం జూటూరు గ్రామానికి చెందిన ఉమాదేవి, కర్నూలు బుధవారపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తన కుమారునికి హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేసిందని ఫిర్యాదు చేశారు. కర్నూలు ఎన్ ఆర్ పేటకు చెందిన రామకృష్ణ, కుదువ పెట్టిన బంగారాన్ని డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకుంటానంటే ఇవ్వడం లేదని వినతి సమర్పించారు. కర్నూలు కప్పల్ నగర్‌కు చెందిన శాంతకుమారి, భర్త మృతి చెందినప్పటికీ అత్త ఆస్తి ఇవ్వడం లేదని న్యాయం చేయాలని కోరారు.

ఆదోనికి చెందిన జయంతి, తన కుమారుడు శశాంక్‌కు నంద్యాలకు చెందిన చందన్ బెంగుళూరు లేదా హైదరాబాద్‌లో మార్కెటింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1 లక్ష తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. కర్నూలు తాండ్రపాడు గ్రామానికి చెందిన ఎస్ ఆర్ జి హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ రామంజనేయులు, ఒక ఇంటిపై రూ.40 లక్షల రుణం తీసుకుని ఒక కంతు మాత్రమే చెల్లించి ఎనిమిది నెలలుగా కంతులు చెల్లించడం లేదని తెలిపారు.
సి.బెళగల్ మండలం కోండాపురం గ్రామానికి చెందిన తెలుగు చిన్న తిమ్మప్ప, తన భార్య మరియు ఆరుగురు కుమారులు కలిసి తనను ఇంటి నుంచి బయటకు పంపించి భోజనం కూడా పెట్టడం లేదని, జీవనాధారం లేక ఇబ్బందులు పడుతున్నానని ఫిర్యాదు చేశారు. కర్నూలు గార్గేయపురానికి చెందిన జార్జ్, తన కుమారుడు అభిలాష్‌కు ఆర్ అండ్ బి విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక వ్యక్తి రూ.1,30,000 తీసుకుని మోసం చేశాడని వినతి సమర్పించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అన్ని ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి చట్టబద్ధంగా విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, సిఐలు రామకృష్ణ, శ్రీనివాస నాయక్, రమేష్, మస్తాన్ వలి పాల్గొన్నారు.
