100yrs | మనిషికి అప్పుడే శాంతి…

100yrs | మనిషికి అప్పుడే శాంతి…

100yrs | రాకెట్ ఆవిష్కరణలో దాగిన గొప్ప జీవన సత్యం
లక్ష్యాన్ని చేరాలంటే భారాలను విడిచిపెట్టాలి
బాధ్యతలు vs బంధాలు – ఎక్కడ గీత గీయాలి?
‘నేను లేకపోతే ఏదీ గడవదు’ అనే భ్రమ
మోక్షసాధనకు తేలికైన మనసే మార్గం

100yrs | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాకెట్..మానవుడు ఆవిష్కరించిన అద్బుత సాంకేతిక ప్రగతి. కనిపించని సుదూర తీరాల లక్ష్యాలను సైతం చేరుకోగల రాకెట్ మానవుడి మేధస్సుకు పరాకాష్ట అనుకోవచ్చు. అసలు రాకెట్ నిర్మాణం, పనితీరు, ప్రయాణించే విధానం అంతా ప్రత్యేకం…దానికీ ఓ ధర్మముంది. అదే రాకెట్ ధర్మం.రాకెట్ కి ఒక ధర్మాన్ని అనుసరించే గుణం ఉన్నప్పుడు, అదే రాకెట్ ని తయారు చేసిన మనిషి, అదె ధర్మాన్ని ఎందుకు అనుసరించలేకపోతున్నాడు? ఒకవేళ అదే ధర్మాన్ని మనిషి అనుసరించగలిగితే, మోకషమనే లక్ష్యాన్ని అవలీలగా చేరుకోవచ్చు.

ఆ లక్ష్యాన్ని చేరుకునే సమయానికి హాయిగా..తేలికగా..శరీరాన్ని పరిత్యజించగలడు.ఇంతకీ ఏమిటా రాకెట్ ధర్మం? దాన్ని మానవులు ఏ విధంగా అనుసరించాలి? ఇప్పుడు చూద్దాం. ఒక రాకెట్ లాంచ్ చేసినప్పుడు ఎంతో బరువుంటుంది. ఎన్నో భాగాలను మోసుకుంటూ భారంగా బయలుదేరుతుంది. అదే రాకెట్ కొంత దూరం దూసుకు పోయినకొద్దీ తనలోని భారాలను తగ్గించుకుంటూ తనని తాను తేలికపర్చుకుంటూ మరింత వేగంగా ప్రయాణిస్తూ లక్ష్యం వైపు పయనిస్తుంది. పూర్తిగా లక్ష్యాన్ని చేరుకునే సమయానికి, చేరాల్సిన భాగం తప్ప అనవసరమైనవాటినన్నిటినీ మధ్యలోనే ఒక్కొక్కటిగా వదిలేస్తుంది.

అవి అనవసరమైనవా అంటే కాదు. వాటి అవసరం, పాత్ర అంతవరకే. మొదలైన దగ్గనుండీ చివరి వరకూ అలాగే భారాలను వెంట తీసుకెళ్తానంటే భారం ఎక్కువై, కుప్పకూలడం ఖాయం. ఇదే ధర్మాన్ని మానవుల జీవితాలకు అన్వయించి చూసుకుంటే, ప్రారంభంలో చదువు సంధ్యలూ, సంపాదన, పెళ్ళి-పిల్లలు, వారి పిల్లలు ఇలా అనేక భారాలతో కొనసాగుతుంది. ఆ తర్వాత, పిల్లల బాధ్యత వరకు సరే, వారి పిల్లల మీద బాధ్యత కంటే, ప్రేమ వరకు సరే, కానీ అంతకు మించి వారి మీద కూడా బెంగ, బాధ్యత, తాము సంపాదించిన ఆస్తుల మీద బెంగ, తాము లేనిదే ఏదీ గడవదేమోనన్న బెంగ…తమ పిల్లలకు, వారి పిల్లలకు, పిల్లల పిల్లలకు ఇలా ఆస్తులు కూడబెడుతూ వాటిని సం రక్షించడమే పరమావధిగా భారాలను పెంచుకుంటూ పోతే ఎలా? ఒక్కొక్కటీ వదిలించుకుంటూ తగ్గించుకుంటూ పోకపోతే మనసెలా తేలికవుతుంది? మోక్షసాధనవైపు మళ్ళగలుగుతుంది? తాము లేకపోతే ఏదీ గడవదన్న భ్రమలో బ్రతికే మనుషులందరూ గ్రహించాల్సిన-తెలుసుకోవాల్సిన కఠోర సత్యం ఒకటుంది. అదే, తాము లేకపోయినంతమాత్రాన ఏదీ ఆగదని.. ఈ కఠోర సత్యాన్ని అర్థం చేసుకుని, నెమ్మదిగా వయసు పెరుగుతున్నకొద్దీ భారాలను, బంధాలను, బాధ్యతలను, తగ్గించుకొంటూ జీవించగలిగితే, మోక్షమనే లక్ష్యం తేలికగా చేరుకోగలరని పెద్దల ఉవాచ.

Leave a Reply