తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : ఎర్రచందనం స్మగ్లింగ్ (Red sandalwood smuggling) చేస్తూ పట్టుబడిన 10మందికి ఒకొక్కరికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు (RSS ADJ Court) న్యాయమూర్తి నరసింహమూర్తి తీర్పునిచ్చారు. రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ అధిపతి ఎల్.సుబ్బారాయుడు (Subbarayudu) రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్ (SP Srinivas) పర్యవేక్షణలో కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరువన్నామలై, వేలూరు జిల్లాకు చెందిన సి.విశ్వనాథన్, డి.సేతు, డి.రమేష్, ఎం.సంపత్, వి.రత్నం, ఎం.బూఛాయాన్, జె.కుమార్, సి.ప్రభు, ఎం.సురేష్, సి.రామర్ అనే పదిమంది ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పెరుమాళ్ల పల్లి బీటు, టీ.ఎన్ పాలెం సెక్షన్ ఎస్వీఎన్పీ డివిజన్ లో 2019లో పట్టుబడ్డారు.
ఆ కేసును విచారించిన న్యాయమూర్తి జులై 31న నేరం రుజువు కావడంతో ఆ 10మందికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పువెలువరించారు. కాగా బెయిలుపై ఉండి, కోర్టుకు విచారణకు హాజరు కాని ప్రభు అనే ముద్దాయికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు మిగతా 9 మందిని నెల్లూరు సెంట్రల్ జైలులో తరలించారు.