ప్రజలు భయాందోళన
ఒంగోలు క్రైం, సెప్టెంబర్ 24 ఆంధ్రప్రభ : ఒంగోలు నగరంలో బుధవారం వేకువ జామున స్వల్ప భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేలు పై తీవ్రత 3.4 మ్యాగ్నిట్యూడ్ గా నమోదయ్యిందని అధికారులు తెలియజేశారు.
అర్ధరాత్రి 2.45 గంటల నుండి 2.53 గంటల మధ్యలో ప్రకంపనలు వచ్చాయని నగర వాసులు తెలిపారు. ఒంగోలు నగరానికి నైరుతి దిశలో సుమారు 3.2 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం నమోదు అయ్యినట్లు జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
స్థానికంగా లాయర్ పేట, శర్మ కాలేజీ దగ్గర, దేవుడి చెరువు, భాగ్యనగర్,
హౌసింగ్ బోర్డ్, మామిడిపాలెం ప్రాంతాల్లో నివాసితులు ఒక్కసారిగా ఉలిక్కి పట్టుకు గురయ్యారు.
పిల్లలు నిద్రిస్తున్న ఇళ్లలో తల్లిదండ్రులు వారిని బయటకు తీసుకువచ్చారు.
రెండు సెకండ్ల పాటు భూమి కదిలిందని ప్రజలు అనుభవాన్ని తెలియజేసారు..
రాత్రి వేళల్లో రావడం వల్ల ఆందోళన మరింత పెరిగినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం గానీ,
ఆస్తి నష్టం గానీ జరగలేదని అధికారులు స్పష్టంచేశారు.
గతంలోనూ ఒంగోలులో ఇలాంటి స్వల్ప భూకంపాలు అనుభవించినట్లు స్థానికులు గుర్తు చేస్తున్నారు.