YSR Congress | ‘మావిగన్’ ప్లాన్ బి ప్రతిపాదన

YSR Congress | ‘మావిగన్’ ప్లాన్ బి ప్రతిపాదన
YSR Congress | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పందించారు. అమరావతికి బదులుగా ‘మావిగన్’ ప్రతిపాదనపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ప్రతిపాదించిన ‘మావిగన్’కు కట్టుబడి ఉన్నానని తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించడం వల్ల భారీ ఖర్చు అవుతుందని, అదే మావిగన్ ద్వారా తక్కువ ఖర్చుతో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
తన హయాంలో ప్లాన్ ఏగా మూడు రాజధానులను ప్రతిపాదించామని, ప్రస్తుతం ప్లాన్ బిగా ‘మావిగన్’ను ముందుకు తెస్తున్నామని వెల్లడించారు. మచిలీపట్నం పోర్టును తమ ప్రభుత్వమే ప్రారంభించిందని, అందుకే మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపే గ్రోత్ కారిడార్‌గా ‘మావిగన్’ను సూచిస్తున్నామని చెప్పారు.
అమరావతిలో అభివృద్ధి పనుల ఖర్చులు భారీగా పెరిగాయని, చదరపు అడుగుకు రూ.14 వేలు ఖర్చు చేయడం సమంజసం కాదని ప్రశ్నించారు. అలాగే కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ.3.52 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై ప్రజలతో మమేకం కావడానికి త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు జగన్ ప్రకటించారు.
