YS Sharmila Reddy | హామీల అమలులో వైఫల్యం

YS Sharmila Reddy | హామీల అమలులో వైఫల్యం

  • రెండేళ్లుగా మహిళల హామీలకు మోసం చేస్తున్న కూటమి
  • మహాశక్తి, ఆడబిడ్డ నిధిపై స్పష్టత ఎప్పుడు..

YS Sharmila Reddy | (విజయవాడ, ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి కీలకంగా ప్రకటించిన మహాశక్తి పథకం రెండేళ్లు కావస్తున్నా అమలుకు నోచుకోకపోవడం ఘోర వైఫల్యమని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పండుగల పేరుతో కాలయాపన చేయడం తప్ప మహిళా సాధికారితపై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కమిట్‌మెంట్ లేదని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.

ఆడబిడ్డ నిధి పేరుతో రాష్ట్ర మహిళలను సీఎం చంద్రబాబు నాయుడు ఘరానా మోసం చేశారని ఆరోపించారు. నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి రూ.15,000 చేస్తామన్నారు, ఆ ఆదాయాన్ని లక్షా యాభై వేల వరకు పెంచే మార్గం చూపుతామన్నారు. కానీ ఇవన్నీ పచ్చి బూటకపు మాటలేనని షర్మిలా స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన ఆడబిడ్డ నిధి పథకం 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ఏటా రూ.18,000 ఆర్థిక భరోసా ఇవ్వాల్సి ఉండగా, రెండేళ్లుగా అమలును వాయిదా వేస్తూ పంగనామాలు పెడుతున్నారని విమర్శించారు.

సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకునే నైతిక హక్కు కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. ఎన్నికల హామీలు నచ్చినప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు అమలు చేసేవి కావని షర్మిలా గుర్తుచేశారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే మహాశక్తి పథకాన్ని తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర మహిళల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నామని ఆమె తెలిపారు.

Leave a Reply