రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పరిధిలోని మొండికుంట అటవీ ప్రాంత శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.

మొరంపల్లి బంజర్ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన బొజ్జ హేమంత్ (22) అశ్వాపురం మండలం మండికుంట గ్రామ శివారు అటవీ ప్రాంతం నుండి ట్రాక్టర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ పక్కనే కూర్చున్న హేమంత్ ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. అనంతరం లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

యువకుడి ఆకస్మిక మృతి కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. గ్రామంలోని ఎస్సీ కాలనీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Leave a Reply