హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రప్రభ) : పరమేశ్వరుడైన శివుడి (Shiva’s) నుండి ప్రవహించే పవిత్రమైన ప్రవాహం నృత్యమని, నటరాజ (Nataraja) స్వరూపంలో ఆయన సృష్టి, స్థితి, లయల నిత్యరాగాన్ని ప్రతిబింబిస్తారని అలాంటి నృత్యం కేవలం ప్రదర్శన కాదని, యజ్ఞమని పలువురు కీర్తిస్తున్నారు. అలా ప్రతి అడుగు ఒక పూజగా, ప్రతి చలనం ఒక ప్రార్థనగా మార్చుకొని ప్రత్యేకభావనతో నాట్య కైంకర్యం నిర్వహిస్తుంటారు కళాకారులు. నాలుగేళ్ల ప్రాయం నుంచే నృత్యరంగంలో శిక్షణ పొందిన యోగిత(Yogita), భగవంతుని పట్ల అదే విధమైన వినమ్ర సేవను భక్తి భావన వ్యక్తీకరణగా మార్చి, కళార్పణగా ప్రదర్శించనుంది.

100కి పైగా ప్రదర్శనలు
నాట్య కైంకర్యం పేరుతో రవీంద్ర భారతి(Ravindra Bharati)లో నృత్యకారిణి యోగిత నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్నారు. శృతి ఆర్ట్స్‌ అకాడమీ (Shruti Arts Academy) ఆధ్వర్యంలో ప్రముఖ నాట్యగురు డాక్టర్‌ జొన్నలగడ్డ శృతకీర్తి (Jonnalagadda Shruti Kirthi) సమక్షంలో రవీంద్రభారతి ప్రధాన ప్రాంగణంలో సెప్టెంబర్‌ 1 సాయంత్రం 6 గంటల నుంచి ఈ నృత్య ప్రదర్శన జరగనుంది. పూర్వరంగం, నాట్యాంజలి, గణేశ స్తుతి, శ్రీకృష్ణ కథామృతం, రవీంద్రనాథ్‌ ఠాగూర్ (Rabindranath Tagore) రచించిన నృత్యనాటకంలోని ఓ భాగమైన చండాలిక, శైవం, శాక్తం అనే విభాగాల్లో యోగిత తన నృత్యప్రతిభను ప్రదర్శించనున్నారు. నాలుగు సంవత్సరాల వయసులోనే జే.యోగిత నాట్యప్రయాణాన్ని ప్రారంభించగా, ఆమె నానమ్మ అంజలి, తల్లిదండ్రులు విజయ్‌, నిర్మల ప్రోత్సాహంతో ఇప్పటికే 100కి పైగా ప్రదర్శనలు, అనేక నాటక రూపకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. పద్మవిభూషణ్‌ డా.అక్కినేని నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao), జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సీ.నారాయణరెడ్డి వంటి ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం (Potti Sriramulu Telugu University) నుండి నృత్యంలో పట్టా పుచ్చుకున్నారు.

చ‌దువుల్లోనూ మేటి…
చదువులోనూ రాణించి చార్టెడ్‌ అకౌంటెన్సీ ఫౌండేషన్ (Chartered Accountancy Foundation) పూర్తి చేశారు. యోగిత నృత్యకైంకర్యానికి ప్రధాన అతిథులుగా ప్రముఖ నటి, మాజీ మంత్రి ఆర్కే.రోజా (former minister R.K. Roja) సెల్వమణి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, ప్రముఖ గేయ రచయిత, దర్శకుడు జేకే.భారవి హాజరుకానుండగా, ఆర్టీఐ మాజీ కమిషనర్‌, అధికారిక భాషా సంఘం చైర్మన్‌ డా.పీ.విజయబాబు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమాన్ని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార సంఘం సభ్యురాలు, న్యాయమూర్తి మాధవి ససనకోట దీపప్రజ్వలన చేసి ప్రారంభించనున్నారు. యోగిత నృత్య ప్రదర్శన అనంతరం జే.సత్యనారాయణమూర్తి, పి.శారదలు ప్రత్యేకంగా సన్మానించి, జేవీ.రాజేశ్వరి అవార్డు ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అవార్డును బహూకరించనున్నారు. అనంతరం శ్రుతి ఆర్ట్‌ అకాడమీ విద్యార్థులకు ప్రముఖ విశ్వవిద్యాలయాల నుండి కళాప్రవేశిక డ్యాన్స్‌ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను సర్టిఫికెట్ అందజేయనున్నారు.

Leave a Reply