చిత్తూరు జిల్లాలో ఐవీఆర్ఎస్ సర్వే ఆరా

( చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో) : తెలుగుదేశం పార్టీ (TeluguDesamParty) చిత్తూరు పార్లమెంటు అధ్యక్ష పదవికి అనూహ్యంగా బీసీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. రాయలసీమ జిల్లాలలోను ఒక యూనిట్ గా తీసుకొని అన్ని వర్గాలకు సమాన అవకాశం కల్పించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా అధ్యక్ష పదవి బీసీలకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. జిల్లా అధ్యక్ష పదవికి పలువురు కమ్మ, బలిజ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి భారీగా పోటీపడ్డారు.

అయితే, గత ఏడాది చంద్రగిరి (Chandragiri) నియోజకవర్గానికి చెందిన సి ఆర్ రాజన్ ను పార్టీ అధిష్టానం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా నియమించింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నగరి నియోజకవర్గానికి పుత్తూరుకు చెందిన షణ్ముగం రాష్ట్ర వన్నెకుల క్షత్రియ చైర్మన్ పదవిని ఆశించారు. ఆయనకు డైరెక్టర్ పదవి దక్కింది. దీంతో కొంత అసంతృప్తిగా ఉన్న కారణంగా ఆయనను జిల్లా అధ్యక్ష పదవికి ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఐ వి ఆర్ ఎస్ ఓటింగ్ ఆధారంగా పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిని నిర్ణయించే అవకాశం ఉంది.

ఆదివారం సీ ఆర్ రాజన్ (CR Rajan), షణ్ముగం పేర్లతో ఐ వి ఆర్ ఎస్ సర్వే ప్రారంభం అయ్యింది. చంద్రగిరి నియోజక వర్గం తిరుచానూరుకు చెందిన మాజీ సర్పంచ్, సినీ నిర్మాత సి అర్ రాజన్ ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాష్ట్ర వన్నికులక్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన అధ్యక్ష బాధ్యత చేపట్టారు. అప్పటి వరకు అధ్యక్షునిగా ఉన్న పులివర్తి నానీకి చంద్రగిరి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వడంతో రాజన్ కు పార్టీ పదవి ఇచ్చారు. నగరి నియోజకవర్గం పుత్తూరుకు చెందిన షణ్ముగం 1999 రాజకీయ రంగ ప్రవేశం చేశారు. దివంగత మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు శిష్యుడిగా 13 ఏళ్లు పాటు పుత్తూరు నగర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రెండు సంవత్సరాలు తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం చిత్తూరు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు, రాష్ట్ర వన్నికులక్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిలో ఉన్నారు.

యువగళం పాదయాత్ర (yuvagalam padayatra) లో లోకేష్ వెన్నంటి ఉన్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. కాగా వారం క్రితం వరకు ఇతర నాయకుల పేర్లు వినిపించాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, బంగారుపాల్యం మాజీ ఎంపిపి ఎన్ పి జయప్రకాష్ నాయుడు, మాజీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ చౌదరి పేర్లు బలంగా వినిపించాయి. అలాగే బలిజ సామాజిక వర్గానికి చెందిన కాజూరు బాలాజీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ తదితరులు రేసులో ఉన్నారు. ఈ నెల 22, 23 తేదీలలో మిగిలిన పార్లమెంట్ నియోజక వర్గాలతో పాటు చిత్తూరు అధ్యక్ష పదవికి ఐ వి ఆర్ ఎస్ సర్వే నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి.

అయితే రాష్ట్రంలోని 25 పార్ల మెంటు నియోజక వర్గాలలో సగం స్థానాలు బిసి, ఎస్సీ సామాజిక వర్గం నాయకులకు ఇవ్వవలసి ఉన్నందున చిత్తూరు, తిరుపతి మరి కొన్ని పార్లమెంటు స్థానాల సర్వేలు వాయిదా వేశారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తరువాత చర్చించి చిత్తూరు అధ్యక్ష పదవి బిసిలకు కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీనితో తిరుపతి స్థానానికి రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అక్కడ బీసీ వర్గానికి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు జి నరసింహ యాదవ్, రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ( రాజు) పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే చిత్తూరు బీసీ వర్గానికి కేటాయించడంతో తిరుపతిలో ఇతర వర్గాలకు అవకాశం కల్పిస్తారని అంటున్నారు.

Leave a Reply